పై చిత్రంలో కనిపిస్తున్న యువకుడి పేరు ప్రణవ్, వయసు 21. పుట్టుకుతోనే రెండు చేతులు లేవు. కానీ పెయింటింగ్ వేయడంలో చేతులు ఉన్నవారికంటే ఎక్కువ ప్రతిభను చూపిస్తాడు. కేరళ లోని పాలక్కాడ్‌ నివాసి అయినా ప్రణవ్‌ బీకామ్‌ కూడా పూర్తి చేశాడు. అయితే తన 21వ పుట్టినరోజు సందర్భంగా... తిరువనంతపురంలోని లెజిస్లేటివ్‌ కార్యాలయానికి మంగళవారం వచ్చి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కు సిఎం విపత్తుల సహాయ నిధి కోసం రూ.5,000 చెక్కును అందజేశాడు. 


చెక్కుపై తన కాలి వేళ్ళతో సంతకం చేసి దానిని సీఎం కి ఇచ్చాడు ప్రణవ్. "మీతో నా పుట్టినరోజుని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది..మీపై పూర్తి నమ్మకం ఉంది, మాలాంటి వారిని ఆదుకునేందుకు మీరు ఎప్పుడూ ముందుటారు" అని ప్రణవ్ పినరయి విజయన్‌ కు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన కాలితో ముఖ్యమంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చి... తన కాలితోనే పినరయి విజయ తో ఓ సెల్ఫీ తీసుకున్నాడు. 


అంగవైకల్యాన్ని జయించి చిత్రకారుడిగా రాణిస్తున్నా ప్రణవ్ ని చూసి ముఖ్యమంత్రి ఫిదా అయ్యాడు. అతని ఔదార్యాన్ని మెచ్చుకుంటూ తన ఫేసుబుక్ లో ప్రణవ్ గురించి రాసారు పినరయి విజయన్‌. "ఈరోజు లెజిస్లేటివ్‌ కార్యాలయానికి రాగానే నాకు ఒక మంచి అనుభవం ఎదురైంది. అలతుర్ ప్రాంతానికి చెందిన ఓ చిత్రకళాకారుడు తన పుట్టినరోజు సందర్భంగా తన వంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం ఇచ్చాడు. ప్రణవ్ తో సహా అతని తల్లిదండ్రులు బాలసుబ్రమణియన్‌‌, స్వర్ణకుమారి, స్థానిక ఎమ్మెల్యే అయినా కేడీ ప్రసన్న కూడా వచ్చారు. అతడు అందించిన విరాళం ఎంతో గొప్పది", అని పినరయి విజయన్‌ తన ఫేసుబుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రణవ్ సచిన్ టెండూల్కర్..ఇంకా ఇతర ప్రముఖుల చిత్రాలను గీసి వారికే బహుమతిగా ఇచ్చి ప్రశంసలు అందుకున్నాడు. అతను విరాళం ఇచ్చిన రూ.5000 కూడా రియాలిటి షో లలో  బొమ్మలు గీసి సంపాదించినవే.


మరింత సమాచారం తెలుసుకోండి: