సీజనల్‌గా వేల కిలోమీటర్లు వలస వచ్చే పక్షులవి. వాతావరణానికి అనుగుణంగా బతకడానికి మంచి ప్లేస్‌ను ఎంచుకొని వస్తాయి. మన దేశంలోని పలు సరస్సుల్లో విహరించి.. సీజన్ మారగానే మళ్లీ సొంత గూటికి వెళ్తాయి.  కానీ బతుకు జీవుడా అని వచ్చిన పక్షులు.. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు రాగానే ప్రాణాలు కోల్పోయాయి. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో ఉన్న ఉప్పునీటి సరస్సు సాంబార్‌లో నీళ్లు తాగి.. వేల పక్షులు ప్రాణాలు విడిచాయి.


రాజస్థాన్‌లోని సాంబార్‌ సరస్సు వద్ద విషాదం నెలకొంది. సుమారు వెయ్యికి పైగా పక్షులు మృతి చెందాయి. అధికారులు వెయ్యి పక్షులు మృతి చెందాయని చెబుతున్నప్పటికీ స్థానికులు మాత్రం 5 వేల పక్షులు మృతి చెందాయని చెబుతున్నారు. విదేశాలకు చెందిన రంగు రంగుల పక్షులు.. శీతాకాలం రాగానే సాంబార్‌ సరస్సు వద్దకు చేరుకుని పక్షి ప్రేమికులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. సుమారు 20 వేల వరకు వలస పక్షులు వస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఏమైందో కానీ వలస వచ్చిన పక్షుల్లో నాలుగో వంతు చనిపోయాయి. సాంబార్‌ సరస్సు వద్దకు చేరుకున్న పక్షి ప్రేమికులు.. పక్షులు విగతజీవులుగా పడిపోవడాన్ని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.


ఏ సరస్సులో విడిది కోసమొచ్చాయో  అదే వాటిని మింగేసింది. విహారానికి వచ్చిన పర్యాటకులు సరస్సు చుట్టూ ఆ పక్షులు చనిపోయి పడి ఉండడం చూసి బర్డ్‌ లవర్స్‌ కంటతడి పెడుతున్నారు. అయితే సాంబార్‌ సరస్సు వద్దకు చేరుకున్న అటవీశాఖ అధికారులు పక్షుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోస్టుమార్టం నిమిత్తం మధ్యప్రదేశ్‌  భోపాల్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. చనిపోయిన పక్షుల్లో 13 నుంచి 14 రకాల జాతులు పక్షులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో బ్లాక్‌ వింగ్డ్‌ స్టింట్స్‌, కేంతీష్‌ ప్లోవర్స్‌, పైడ్‌ అవోసెట్స్‌ లాంటి వివిధ రకాల విదేశీ పక్షులు ఉన్నాయి. నీటి కాలుష్యం కారణంగా పక్షులు చనిపోయాయా? లేక బర్డ్‌ ఫ్లూ సోకి చనిపోయాయా? అన్నది ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి నివేదిక వచ్చిన తర్వాతే తేలనుంది. వాటర్‌ శాంపిల్స్‌ను కూడా ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. వైరస్‌ వల్లే పక్షులు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు కొందరు అధికారులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: