లాడెన్‌ దొరికాడు. దొరకడమేంటి..? ఆ కరుడుగట్టిన ఉగ్రవాదిని ఎప్పుడో అగ్రరాజ్యం మట్టుబెట్టింది కదా అనుకుంటున్నారా..? ఇక్కడ దొరికింది అసోం వాసులను గజగజలాడించిన గజరాజు లాడెన్‌.  ఐదుగురు ప్రాణాల్ని మింగేసిన లాడెన్‌ను  పట్టుకున్నారు అధికారులు.


అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను ఎనిమిదేళ్ల క్రితం అమెరికా సైన్యం చంపేసింది. అయినా లాడెన్‌ ని ప్రపంచం ఇంకా మరిచిపోలేదు. బారెడు గడ్డమున్న ఈ లాడెన్‌ సంగతేమో కానీ, భీకర ఆకారంతో ప్రళయం సృష్టిస్తున్న నయా లాడెన్‌ అస్సాంను వణికిచింది. ఆ టెర్రరిస్ట్‌ మాదిరే ఏ పాపం పుణ్యం ఎరుగని అమాయకులను చంపుతున్న ఇండియా బిన్ లాడెన్‌ను పట్టుకోడానికి చాన్నాళ్లుగా సాగుతున్న ప్రయత్నాలు చివరకు ఫలించాయి. 


ఈ ఏడాది అక్టోబర్‌ అసోంలోని గోల్పారా జిల్లాలో ఈ క్రూర మృగం ఐదుగురు గ్రామస్తులను పొట్టన పెట్టుకుంది. దీన్ని  పట్టుకునేందుకు అధికారులు ఒక ప్రత్యేక ఆపరేషన్‌  చేపట్టారు. ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ కావడంతో ఎట్టకేలకు గజరాజు  దొరికిపోయింది. దీన్ని పట్టుకోవడానికి డ్రోన్లు, పెంపుడు ఏనుగులను ఉపయోగించి చాలా రోజుల పాటు అడవిలో అటవీశాఖ అధికారులు జల్లెడ పట్టారు. నిపుణులైన షూటర్లు, బాణాలతో మత్తు మందిచ్చి ఎట్టకేలకు ఈ గజరాజును ట్రాప్‌ చేశారు.


ఇప్పుడు లాడెన్‌ ఏనుగును సమీపంలో మానవ నివాసాలులేని అడవికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్టోబర్‌ నెలలో 24గంటల వ్యవధిలో లాడెన్‌ ఏనుగు గోల్పారా జిల్లాలో ముగ్గురు మహిళలతో సహా ఐదుగురిని చంపింది. అటవీ శాఖ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో మనదేశంలో సుమారు 2 వేల 300 మంది ప్రాణాలు కోల్పోగా... 2011 నుంచి ఇప్పటివరకు 700 ఏనుగులు హతమయ్యాయి.  ఎంతగానో వేధించిన లాడెన్‌ ఏనుగు పట్టుబడటంతో అస్సాం వాసులు ఊపిరి పీల్చుకున్నారు. రిస్క్ తీసుకున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: