కర్ణాటకలో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీం తీర్పు చెప్పింది. స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. అయితే ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలో పోటీ చేసే విషయంలో మాత్రం ఊరట లభించింది. డిసెంబర్ 5న కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటకలో బై పోల్స్ మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. 


కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ అప్పటి స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం  సమర్థించింది. అయితే 2023 వరకు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ ఇచ్చిన ఆదేశాలను మాత్రం కొట్టివేసింది. దీంతో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశమిస్తూ ఊరట కల్పించింది. 


ఇక...కేసుకు సంబంధించిన నిజానిజాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు వెల్లడించామని సుప్రీంకోర్టు తెలిపింది. అనర్హత విషయంలో స్పీకర్‌ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. అయితే అనర్హత కాలం మాత్రం స్పీకర్ నిర్ణయించలేరని సుప్రీమ్ చెప్పింది. 


ఈ ఏడాది జులైలో కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వ కుప్పకూలింది. దీంతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ సమయంలో పార్టీ విప్ ధిక్కరించినందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ అనర్హత వేటు వేశారు. వారిని అనర్హులుగా ప్రకటించడమేగాక.. ప్రస్తుత అసెంబ్లీ ముగిసే దాకా ఆ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. 


అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు విడతల వారీగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎన్వీ  రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గత అక్టోబరు 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం సరైందేనంటూ తీర్పు వెల్లడించింది. అయితే వారు ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.



మరింత సమాచారం తెలుసుకోండి: