ఏపీలో టీడీపీని ఖాళీ చేయాలని కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నారా ? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఇప్పటికే రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేసుకుంది. ఇక రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు వేగంగా ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తోంది. గంటాతో మొదలైన చేరికలు... ఎక్కడ ఆగుతాయంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. 


ఆంధ్రప్రదేశ్‌లో 2024లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనంటున్నారు కమలనాథులు. ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీకి ఆ పరిస్థితి ఉండదంటూ టీడీపీపై సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ నేతల మాటలు చూస్తుంటే రానున్న రోజుల్లో.. టీడీపీని ఖాళీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ టీడీపీ రాజ్యసభ ఎంపీలు సుజనా, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్ బీజేపీలో చేరారు. తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్, ప్రధాని మోడీని కలిశారు. దీంతో గంటా కాషాయతీర్థం పుచ్చుకోవడం ఖాయంగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో 23 మందిని తీసుకుంటాం అంటూ బీజేపీ నేత సోము వీర్రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.


టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన అధికార ప్రతినిధి యామినీ సాధినేని త్వరలో బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. రాయలసీమలో ఇప్పటికే కొంతమంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కాషాయ జెండా కప్పుకున్నారు. గంటాతో పాటు ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అసెంబ్లీలో బీజేపీకి గౌరవ ప్రదమైన సంఖ్య వస్తుందని కమలనాథులు చేస్తున్న కామెంట్లు చూస్తే ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా ఉన్నట్లు కనిపిస్తోంది.


ఏపీతో పాటు తెలంగాణలోనూ బీజేపీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నుంచి భారీగా నేతల్ని బీజేపీలో చేర్చుకుంటున్నారు. రెండురోజులకోసారి తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నేతలు వెళ్లి ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకుని వస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఇప్పటికే అస్థిత్వం కోల్పోయిన పరిస్థితి. ఏపీలోనూ గంటాతో మొదలయ్యే వలసల పర్వం.. ఎంత దూరం వెళుతుందో అర్థం కాని పరిస్థితి.


రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ వైపు మళ్లింది. ఏపీలో పుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్  చేయలేకపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఏపీలో టీడీపీని దెబ్బ తీస్తే తమ ఓటు బ్యాంక్ పెరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: