రైతులకి ఇవ్వాల్సిన రెండు కోట్ల బకాయిలు ఎగ్గొట్టేందుకు ఓ వ్యాపారి వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. తాను చనిపోయినట్టు అందరినీ నమ్మించి ఎస్కేప్ అవ్వాలని స్కెచ్ వేశాడు. వర్కవుట్ కాకపోవడంతో పోలీసులకు చిక్కాడు ఆ కేటుగాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేలా జరిగిన ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 


రైతులను మోసం చేయాలని ప్లాన్ వేశాడు. కోడి రక్తాన్ని మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద చల్లి తాను హత్యకు గురైనట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. ఎక్కడో నక్కొని తరచూ ఇంటికి ఫోన్ చేస్తూ  దొరికిపోయాడు. రైతులకు డబ్బు ఎగ్గొట్టేందుకు మొక్కజొన్న వ్యాపారి సాయి దుర్గారావు వేసిన ఎస్కేప్ ప్లాన్... ఏలూరు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.


పశ్చిమగోదావరి జిల్లా  రామన్నపాలెం వ్యాపారి సాయి దుర్గారావుకు.... చీకట్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి పెద్ద మొత్తంలో బాకీ ఉన్నాడు. మరోవైపు రైతులకు దుర్గారావు రెండు కోట్ల మేర డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే తనకు రావాల్సిన డబ్బులు శ్రీనివాసరావు ఎంతకీ ఇవ్వకపోవడంతో అతనిపై కక్షపెంచుకున్నాడు. అక్టోబర్ 22న శ్రీనివాసరావు డబ్బులు ఇస్తానంటూ రమ్మన్నాడని ఇంట్లో చెప్పి.... రాత్రి చొదిమెళ్ల వద్ద ఉన్న మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాడు దుర్గారావు. అక్కడ కోడి రక్తాన్ని చల్లి.. కళ్లజోడును వదిలేసి ఎస్కేప్ అయ్యాడు. వెళ్తూ బైకును చేబ్రోలు కాలువలో పడేశాడు.  తనను శ్రీనివాసరావు చంపేశాడనే విధంగా సీన్ క్రియేట్ చేశాడు.  


ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి ఆధారాలు సేకరించిన పోలీసులకు దర్యాప్తులో ఎలాంటి క్లూ లభించలేదు. ఎంతకీ కేసు చిక్కుముడి వీడకపోవడంతో మరో కోణంలో ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. దుర్గారావు కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టడంతో అసలు గుట్టు రట్టైంది. కుటుంబ సభ్యులకు వేర్వేరు నంబర్ల ద్వారా ఫోను చేస్తూ దుర్గారావు దొరికిపోయాడు. 


రైతులకు ఇవ్వాల్సిన రెండుకోట్లు మిగుల్చుకోవడంతో పాటు... తను పగబట్టిన శ్రీనివాసరావుపై కక్ష తీర్చుకునేందుకే దుర్గారావు ఈ ప్లాన్ వేశాడని ఏలూరు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దుర్గారావుకు సహకరించిన వారు ఎవరనే దానిపై  పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.  దుర్గారావు పట్టుబడడంతో తమ డబ్బులు చెల్లించాలంటూ రైతులు వేడుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: