పయ్యావుల కేశవ్...టీడీపీలో సీనియర్ నేత. రాజకీయాల్లో నిర్మాణాత్మకమైన విమర్శలు చేసే నాయకుడు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కూలంకషంగా మాట్లాడే ఈ నేత...ఉరవకొండ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు. 1994,2004, 2009, 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఒక్క 1994 తప్ప మిగతా మూడు సార్లు టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. కానీ 2004, 09లలో ప్రతిపక్షంలో ఉన్న పయ్యావుల హుందాగా వ్యవహరిస్తూ, సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టేవారు.


కానీ అలాంటి నేత 2019లో మాత్రం సైలెంట్ గా ఉండిపోతున్నారు. అధికార వైసీపీ మీద దూకుడుగా వెళ్ళడం లేదు. ఏ విషయంపై కూడా మీడియా సమావేశం పెట్టి అధికార పక్షాన్ని ప్రశ్నించడం లేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు...పయ్యావులకు ఉన్న అనుభవం, మాటతీరుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంలో ప్రతిపక్షానికి దక్కే అత్యున్నత పదవి ప్రజాప‌ద్దుల క‌మిటీ చైర్మ‌న్‌(పీఏసీ)గా అవకాశమిచ్చారు.


ఈ పదవి కోసం టీడీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నించిన బాబు మాత్రం పయ్యావులపై నమ్మకం ఉంచి పదవి కట్టబెట్టారు. కానీ పదవి వచ్చిన పయ్యావులలో దూకుడు లేదు. ప్రభుత్వం లెక్కల్లో బొక్కలు పట్టుకుని ఇబ్బంది పెట్టాల్సిన పయ్యావుల సైలెంట్ అయిపోయారు. అయితే ఆయన ఇంతలా సైలెంట్ అయిపోవడానికి  కూడా కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం ఎలాంటి విమర్శ చేసిన వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టేలా ఉంది.
దానికి తోడు పయ్యావులకు కొందరు వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొందరితో వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. అటు తెలంగాణలో కూడా పయ్యావుల వ్యాపారాలు నడుపుతున్నారు. ఇక జగన్-కేసీఆర్ కు ఎలాగో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పయ్యావుల వైసీపీ మీద దూకుడు ప్రదర్శించడం లేదు.


దీనికి తోడు పయ్యావుల బీజేపీలోకి వెళ్లిపోతారని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పైగా ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న పయ్యావులని బాబు పరామర్శించారు. అయితే పయ్యావుల ఎప్పుడొకప్పుడు పార్టీకి దెబ్బ వేస్తారనే భయంతోనే బాబు ముందుగానే అలెర్ట్ అయి పరామర్శించినట్లు అర్ధమవుతుంది. మరి చూడాలి నమ్మినబంటు బాబుకు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో?


మరింత సమాచారం తెలుసుకోండి: