పాపం ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన ఆనందం రోజుల్లోనే ఆవిరి అయిపోయింది. మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన రోజే ఆయ‌న‌కు సంబంరం మిగిలి ఉండి ఉంటుంది. ఆ మ‌రుస‌టి రోజు నుంచి ఆయ‌న‌కు చుక్క‌లే క‌న‌ప‌డుతున్నాయి. చివ‌ర‌కు ఆయ‌న సైతం త‌న‌కు ఈ ప‌ద‌వి ఎందుకు వ‌చ్చిందిరా ? అని స‌న్నిహితుల వ‌ద్ద వాపోయే ప‌రిస్థితి కూడా వ‌చ్చేసింది. పేరుకే మాత్రం ఆయ‌న మంత్రి.. చివ‌ర‌కు త‌న మాటకు విలువ లేదు.. పెత్త‌నం అంతా వేరే వాళ్ల‌దే....  సొంతంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం కాదుక‌దా.. అభిప్రాయం చెప్పుకునే అవ‌కావం కూడా లేద‌ట‌.. ఇంత‌కు ఆ మంత్రి ఎవ‌రు అనుకుంటున్నారా ? ఇంకెవ‌రు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేబినెట్లో ర‌వాణా శాఖా మంత్రిగా ఉన్న పువ్వాడ అజ‌య్ కుమార్‌.


ఖ‌మ్మం నుంచి వ‌రుస‌గా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌కు కేసీఆర్ కేబినెట్లో మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆర్టీసీ స‌మ్మె తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలో మంత్రి పువ్వాడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వంగా జిల్లాలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో మ‌ళ్లీ కేసీఆర్ ఆయ‌న‌కే మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని అనుకున్నారు.


అయితే కేటీఆర్ దోస్త్ కావ‌డంతో అజ‌య్‌కే మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. ఇప్పుడు ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో ఆయ‌న ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సొంతంగా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశ‌మే లేదు. సొంత అభిప్రాయం చెప్పే ఛాన్సే ఉండ‌ద‌ట‌. అంతా కేసీఆర్ ఏం చెపితే అదే జ‌రుగుతోంది. అయితే ఆర్టీసీ శాఖా మంత్రిగా ఆయ‌న‌కు కార్మికుల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త మ‌వుతోంది. ఇక అటు హైకోర్టు విచార‌ణ నేప‌థ్యంలో రోజు గంట‌ల కొద్ది స‌మీక్ష‌లు, కేసీఆర్‌, అధికారులు ఏం చెపితే అది విన‌డం త‌ప్పా చేసేదేం లేద‌ని తెలుస్తోంది.


ఇక స‌మ్మె రోజు రోజుకు తీవ్ర‌త‌రం కావ‌డంతో కార్మికుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సామాన్య జ‌నం నుంచే కాదు.. గులాబీ గూటిలోని ప‌లువురు కీల‌క నేత‌లు కూడా గుర్రుగా ఉన్నారు. ఇక అటు మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ అంద‌రు త‌న‌ను టార్గెట్ చేయ‌డంతో పువ్వాడ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు టాక్‌..?


మరింత సమాచారం తెలుసుకోండి: