నలభైరోజులుగా ఆర్టీసి శ్రామికులసమ్మెతో తెలంగాణా ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. ఆరోగ్యం, విద్య తరవాత ప్రజలకు అతి ముఖ్యమైనది ప్రజారవాణా  మాత్రమే. అలాంటి ప్రజారవాణా నిర్వహణ తెలంగాణాలో నలభై రోజులుగా అపహస్యం పాలైంది, అవుతూ ఉంది కూడా! దీని పరిష్కారం పారిశ్రామిక వివాదాల చట్టం ద్వారా లభిస్తుంది. లేబర్ కమీషనర్ పరిధిలో పరిష్కారం కావలసిన అంశం ముఖ్యమంత్రి ముందుకు రావటం బహు శోచనీయం. దీని వెనుక ఏదో (కు) తంత్రం లేదా వ్యూహం ఉందనేది నలభై రోజులుగా పరిష్కారం కాకపోవటంతో ప్రజలకు వస్తున్న అనుమానం.
Image result for TSRTC privatization is

నేడు తెలంగాణా హైకోర్ట్  "టీఎస్-ఆర్టీసీ" అనే వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరని స్పష్టం చేసిన దరిమిలా,  తన రాష్ట్ర రవాణా అయినందున చట్ట ప్రకారం ఏర్పాటై ఉంటేనే ఆ సంస్థపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉండి ఉండేవి, అలా ఉండాలంటే టిఎస్ ఆర్టీసి ఏర్పాటుకు ముందుగా కేంద్రం అనుమతి అత్యవసరమని ధర్మాసనం పేర్కొంది. 


"టిఎస్ ఆర్టీసీ అనే దానికి ఉనికే లేనందున" విభజనానంతరం కొత్త చట్టం ఏర్పడే వరకు ఈ ఆర్టీసీ కేంద్ర చట్టంలో అంతర్భాగమే. ఇది విభజన చట్టంలో ముందుగానే వివరించబడిందని అంటున్నారు. అందువల్ల ఏరకంగా చూసినా - కేంద్ర అనుమతి చాలా ముఖ్యమైన అవసరమేనని పేర్కొంది. 


ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో బుధవారం (నవంబర్ 13) విచారణ జరిగింది. ఆర్టీసి ఉద్యోగుల సమ్మె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దానికి హైకోర్టు మంగళవారం సూచించిన, ముగ్గురు "సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ" ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం కుదరదని చెప్పింది. 


పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీ ప్రస్తావన లేదని హైకోర్టులో ఈ అంశంపై విచారణ పెండింగ్‌ లో ఉన్నందున లేబర్‌ కోర్టుకు వెళ్లలేదని తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. తదుపరి చర్యలు చేపట్టేలా కార్మికశాఖ కమిషనర్‌ ను ఆదేశించాలని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుచేసే అధికారం హైకోర్టుకు ఉంటుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్ వాదించారు.


అయితే పారిశ్రామిక వివాదాల చట్టంలో ఈ కమిటీ ప్రస్థావన లేదు కాబట్టి లేబర్‌ కోర్టుకు వెళ్లలేదని చెప్పిన ప్రభుత్వం - మరి కేంద్రం వాటాదారుగా ఉన్న ఆర్టీసీపై - విభజన అనంతరం ఏపిఎస్ ఆర్టీసి రూల్స్ వర్తించనందున, కేంద్ర చట్టాన్ని అనుసరించాల్సిన వేళ ఇలా తనే ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం ధర్మబద్ధమా? న్యాయబద్దమా? కనీసం చట్టబద్ధమా? అనేది తెల్చాల్సింది హైకోర్ట్ మాత్రమే కదా! అందుకే విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు అవసరాన్ని సూచించింది. మరి సమస్య పరిష్కారమవ్వాలంటే ఇదే సరైన మార్గం.  


ఎస్మా ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం తరఫున వాదించిన ఏజీ పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌-3 ప్రకారం టీఎస్‌ ఆర్టీసీని ఏర్పాటు చేసినట్లు అడ్వొకెట్ జనరల్ (ఏజీ) వివరించారు. అయితే, సెక్షన్‌-47 ప్రకారం కేంద్రం అనుమతి లేదు కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. అంటే అబ్-ఇనిషియో "టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటు" చట్టపరిదిలోని ఏర్పాటు కాదు అని చెప్పకనే చెప్పింది.


అయినా టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తప్పనిసరి కాదని, రోడ్డు రవాణాపై రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని ఏజీ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వా నికి అధికారాలు ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి అవసరమని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించగా, ఆయన వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సమ్మె చట్ట విరుద్ధమని మీరెలా చెప్తారని ప్రశ్నించింది. సమ్మె పరిష్కారానికి హై-పవర్‌ కమిటీ వేయాల్సిందేనని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్‌ వాదించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు.


ఇప్పటివరకు 27 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పిటిషనర్లు హైకోర్టుకు నివేదించారు. "దేశ సర్వోన్నత న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తుల ఉన్నత స్థాయి కమిటీ"ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోర్టును అభ్యర్థించారు. అసలు తెలంగాణా ఆర్టీసి శ్రామికుల సమ్మెవలన ఏర్పడ్డ ప్రజల సమస్యను తొలిగా పరిష్కరించ వలసిన  రాష్ట్ర ప్రభుత్వం టిఎస్-ఆర్టీసి ప్రయివేటైజేషన్ మనసులో పెట్టుకొని అందుకు అడ్డుగా ఉన్న ఆర్టీసి యూనియన్ల అడ్దుతొలగించుకోవటానికే నిర్ణయించుకున్నట్లు అవగతమౌతూనే ఉంది. కేసీఆర్ నియంతలాగా తీసుకున్న ఆర్టీసి ప్రయివేటైజేషన్ అనే ఏకపక్ష నిర్ణయం ఈసమస్య పరిష్కారం కాకుండా పీఠముడి పడేలా చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు, విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Image result for TSRTC privatization is

మరింత సమాచారం తెలుసుకోండి: