ఆర్టీసీ కార్మికుల సమ్మె 40వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై 40 రోజులైనా ప్రభుత్వం నుండి కార్మికులు ఆశించిన స్పందన వ్యక్తం కాలేదు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. కొందరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సీఎం కేసీఆర్ తీరుపై ఆర్టీసీ కార్మికుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్ డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. 
 
జేఏసీ నేతలు, ఆర్టీసీ కార్మికులు ఇబ్రహీంపట్నం బస్ డిపో ముందు బైఠాయించారు. ఆ తరువాత ఒక కార్మికుడిని చనిపోయినట్టు పడుకోబెట్టి సీఎం కేసీయార్ చనిపోయాడంటూ వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు సీఎం తీరుతో విసుగు చెందామని అందుకే ఇలా నిరసన తెలిపామని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని కార్మికులు కోరారు. 
 
మరోవైపు హైకోర్టు సూచించిన ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ప్రతిపాదనకు ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. అడ్వకేట్ జనరల్ టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తప్పనిసరి కాదని, రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్డు రవాణాపై సర్వాధికారాలు ఉంటాయని వాదనలు వినిపించారు. కేంద్ర చట్టంలో ఆర్టీసీ చట్టం భాగమేనని కేంద్రం అనుమతి అవసరమేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. 
 
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ వైఖరి వలనే మహబూబాబాద్ డిపో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు చేశారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మొండివైఖరే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణమని తెలిపారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: