తెలుగుదేశం పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది . తెలుగు  యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆ పార్టీ కి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు . గురువారం సాయంత్రం నాలుగు గంటలకు అవినాష్, ముఖ్యమంత్రి , వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షం లో ఆ పార్టీ లో చేరనున్నట్లు తెలుస్తోంది . అవినాష్ టీడీపీ ని వీడి వైకాపా లో చేరనున్నారని గత కొంతకాలంగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి . అయితే ఈ ఊహాగానాలను అవినాష్ పలుమార్లు ఖండించారు . తాను టీడీపీ లోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు.


కానీ టీడీపీ లో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావిస్తోన్న అవినాష్ , బుధవారం తన అనుచరులు , అభిమానులతో సమావేశమయ్యారు . టీడీపీ నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వని కారణంగా పార్టీ మారాలని ఆయనపై అనుచరులు , అభిమానులు ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది . తన అనుచరులు , అభిమానుల ఒత్తిడి మేరకు అవినాష్ , పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవినాష్ గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు . గుడివాడ లో తనకు పట్టులేకపోయినా, పార్టీ నాయకత్వం ఆదేశం మేరకు పోటీ చేసి , ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి , ప్రస్తుత మంత్రి కొడాలినాని కి గట్టి పోటీనిచ్చారు .


 ఎన్నికల్లో టీడీపీ ని ఘోరంగా ఓటమిపాలుకావడం తో , అవినాష్ తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచన పడినట్లు తెలుస్తోంది . అందుకే గుడివాడ నుంచి కాకుండా , విజయవాడ నగరం లోని ఒక నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించాలని టీడీపీ నాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది . కానీ దానిపై టీడీపీ నాయకత్వం సానుకూలంగా స్పందించకపోవడం , వైకాపా తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో అవినాష్ పార్టీ మారడానికి రెడీ అయ్యారన్న వాదనలు విన్పిస్తున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: