మరో రెండు నెలల్లో ఏపీలో లోకల్ ఫైట్ కి రంగం సిద్ధమవుతోంది. 2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిన విపక్షాలకు ఇపుడు మరో అవకాశంగా స్థానిక ఎన్నికలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బలంగా ఉన్న వైసీపీకి మరో మారు బంపర్ విక్టరీ కొట్టడానికి కూడా స్థానిక ఎన్నికలు దారి చూపుతాయని భావిస్తున్నారు. మాటలతో ఇప్పటికే యుధ్ధం చేసుకుంటున్న వైసీపీ, టీడీపీ బీజేపీ, జనసేన పార్టీల అసలు సత్తా ఏంటో స్థానిక ఎన్నికలు  లెక్క కట్టి మరీ తేల్చనున్నాయి.


నిజానికి స్థానిక‌ ఎన్నికల కోసమే చంద్రాబాబు ఎప్పటి నుంచో రంగంలోకి దిగిపోయారు. అయిన దానికి కాని దానికి రచ్చ చేస్తూ రోడ్డు మీదకు వచ్చేస్తున్నారు. జగన్ ఇలా సీఎం గద్దెనెక్కాడో లేదో కానీ అలా బాబు ఆయన్ని విమర్శిస్తూ రెచ్చిపోతున్నారు. జగన్ ఏపీలో చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇదంతా స్థానిక ఎన్నికల్లో గెలవడానికి అని వేరేగా చెప్పనక్కరలేదు.  ఇక మరో వైపు పవన్ కళ్యాణ్ కూడా జగన్ని టార్గెట్ చేశారు. ఆయన సైతం లాంగ్ మార్చ్ పేరిట ఇసుక మీద ఆందోళన చేస్తూ వచ్చారు. ఇపుడు ఇంగ్లీష్ భాష వద్దు తెలుగు ముద్దు అంటూ గట్టిగా నినదిస్తున్నారు. ఇంకో వైపు బీజేపీ, వామపక్షాలు సైతం కూడా జగన్ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ జనంలోకి వెళ్తున్నాయి.


ఇక అధికార పార్టీగా వైసీపీ తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలనే గట్టిగా నమ్ముకుంటోంది. పైగా స్థానిక ఎన్నికల్లో విపక్షాలకు అసలు చాన్స్ ఇవ్వకూడదని పనిచేస్తోంది. ఇక  స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిధ్ధం కావాలని జగన్ మంత్రులకు సూచించారు. తాము ఎన్నికల నిర్వహణకు రెడీ అంటూ ప్రభుత్వం తరఫున హైకోర్టులో ఈ రోజు అఫిడవిట్ దాఖలు చేయబోతోంది. మొత్తానికి జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: