ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని , ఇసుక కొరతను అరికట్టాలని డిమాండ్ చేస్తూ  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ధర్నా చౌక్ లో దీక్ష చేపట్టాలని నిర్ణయించారు . అయితే చంద్రబాబు దీక్షకు పోటీగా వైకాపా కు చెందిన ఎమ్మెల్యే , మాజీ మంత్రి పార్థసారథి కూడా తాను దీక్ష చేపడుతానని ప్రకటించారు . బాబు దీక్ష వేదిక సమీపం లోనే తాను దీక్ష చేపడుతానని పార్థసారథి ప్రకటించినప్పటికీ , అయన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది .


చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని , ఆయనపై పరువునష్టం దావా వేస్తానన్న పార్థసారథి , ధర్నా చౌక్ వద్ద తన దీక్షకు అనుమతి ఇవ్వాలని హోంమంత్రి కి, పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాశాడు . కానీ నగరం లో ఉద్రిక్తలకు చోటు ఇవ్వరాదని కారణంగా పార్థసారథి దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది . అయితే రాష్ట్రం లో ఇప్పుడిప్పుడే ఇసుక కొరత క్రమేపి తగ్గుముఖం పడుతుందని , ఈ సమయం లో చంద్రబాబు దీక్షకు దిగడం హాస్యాస్పదంగా ఉందని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు . నిన్న ,మొన్నటి వరకు వర్షాలు కురిసి , నదులన్నీ ఉప్పొంగి ప్రవహించిన విషయం తెల్సిందేనని గుర్తు చేస్తున్నారు .


ఇసుక కొరత ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక వారోత్సవాలను కూడా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు . ప్రతి రోజు రెండు లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెల్సిందేనని గుర్తు చేస్తున్నారు . ప్రభుత్వమే చొరవ తీసుకుని ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తుంటే బాబు దీక్ష వల్ల ఆ పార్టీ కి ఒరిగేది ఏముందని ప్రశ్నిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: