రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని  హయత్  నగర్  పోలీసు స్టేషన్ లెక్చరర్స్ కాలనీలో ఒక వైద్యుడు మత్తు ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . భార్య , కొడుకు తనకు దూరం కావడం తట్టులోలేకనే మత్తు ఇంజెక్షన్ చేసుకుని వైద్యుడు రమేష్ బలవన్మరణానికి  పాల్పడినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు . గత కొంతకాల క్రితం  భార్య , కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లడం తో రమేష్ తరుచూ ఒంటరిగా ఉంటున్నాడని చెప్పుకొచ్చారు . భార్య దూరమైందన్న బాధతో  ఒంటరిగా ఉంటున్నాడని అనుకున్నామని కానీ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతాడని భావించలేదని అన్నారు .


 వివరాల్లోకి వెళితే ...      రోగులకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చే ఆ వైద్యుడు చివరకు తనకు  తానే మత్తు ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది .  హయత్ నగర్ లెక్చరర్స్‌ కాలనీలో నివసించే మంతటి మురళీధర్‌రావు కొడుకు రమేష్‌ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓబుల్‌రెడ్డి ఆసుపత్రిలో మత్తు ఇంజక్షన్‌ (అనస్తీషియ) ఇచ్చే డాక్టర్‌ గా పనిచేస్తున్నాడు.  అతని భార్య స్వప్న కిమ్స్‌ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంది. వీరిద్దరికి  ఒక కొడుకు కూడా  ఉన్నాడు. అయితే  కొంతకాలంగా భార్యాభర్తల మద్య తగాదా నడుస్తోంది.


 గత ఆరు నెలలుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.  రమేష్‌ లెక్చరర్స్‌ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా.. స్వప్న బీహెచ్‌ఈఎల్‌లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది . భార్య వెళ్లిపోవడం తో  మనస్తాపానికి గురైన రమేష్‌  డాబాపైకి వెళ్లి మత్తు ఇంజక్షన్‌ తీసుకున్నాడు.  ఉదయం కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అప్పటికే  రమేష్ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: