చంద్రబాబుకు వరస షాకులు తగులుతున్నాయి. టీడీపీలో నుంచి సీనియర్లు ఓ వైపు పార్టీని వీడిపోతూంటే ఎమ్మెల్యేలు మరో వైపు క్యూ కడుతున్నారు. ఇపుడు పార్టీలోని యువ నాయకులు కూడా వేరే దారి చూసుకుంటున్నారంటే పార్టీ పరిస్థితి గురించి బాగా ఆలోచించాల్సిన్సే. చంద్రబాబు ఇసుక దీక్షలు, సమీక్షలు అంటున్నారు కానీ మరో వైపు జూనియర్లు కూడా ఉండలేమని పార్టీకి దండం పెట్టేస్తున్నారు.


విజయవాడకు చెందిన దేవినేని కుటుంబ వారసుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీని వీడిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన మనసు టీడీపీ వద్దంటోందట. విజయవాడలోని గుణదలలోని తన నివాసంలో అభిమానులు, అనుచరులతో అవినాష్ తాజాగా  సమావేశం ఏర్పాటు చేసి మరీ తన ఆవేదనను వెళ్ళగక్కినట్లుగా సమాచారం.


టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని అవినాష్ ఈ సందర్భంగా బాధపడినట్లుగా చెబుతున్నారు. తనతో పాటు అభిమానులకు, అనుచరులకు న్యాయం జరగడంలేదని కూడా అవినాష్ అన్నట్లుగా సమాచారం. ఇక అవినాష్ ని పార్టీ మారాలని అనుచరులు కూడా వత్తిడి తెస్తున్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ పరిస్థితిని, భవిష్యత్తును బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించినట్లుగా చెబుతున్నారు.


కాగా తన అనుచరులతో మరో మారు  సంప్రదించిన మీదటనే అవినాష్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.  ఇక ఆయన తొందరలోనే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారని అంటున్నారు. అదే కనుక జరిగితే క్రిష్ణా జిల్లాలో బలమైన సామాజిక వర్గం, రాజకీయంగా పట్టున్న కుటుంబం నుంచి యువ నేత  టీడీపీకి దూరం అయినట్లుగానే భావించాలి. ఇది నిజంగా టీడీపీకి గట్టి షాక్ గా కూడా అంటున్నారు. గతంలో కూడా అవినాష్ పార్టీ మారుతారని ప్రచారం జరిగినా ఈసారి అది నిజం కాబోతోందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: