తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 41వ రోజుకు చేరింది. సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రిలోపు కార్మికులు విధుల్లో చేరితే చేరినవారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ పెట్టిన గడువులోగా 495 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నట్లు డిపో మేనేజర్లకు, ప్రత్యామ్నాయ కార్యాలయాల్లో లేఖలు ఇచ్చారు. 495 మంది ఆర్టీసీ కార్మికులు లేఖలు ఇవ్వగా వీరిలో కేవం 220 మందికి మాత్రమే అధికారుల నుండి పిలుపు వచ్చింది. 
 
ప్రస్తుతం 220 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరి విధులకు హాజరవుతూ ఉండగా మిగతా 275 మంది మాత్రం అధికారుల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. డిపో మేనేజర్లు మాత్రం లేఖలు అందినవారికి విధుల్లో చేరే అవకాశం కల్పించామని 275 మంది సమర్పించిన లేఖలు తమకు అందలేదని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులు గత రెండు నెలల వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 
 
వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న కొందరు ఆర్టీసీ కార్మికులు వేతనాల కోసం తిరిగి విధుల్లో చేరారు. కానీ అధికారుల నుండి పిలుపు రాకపోవడంతో ఈ నెల వేతనం కూడా అందదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఆర్టీసీ కార్మికులు కొన్ని ప్రత్యామ్నాయ కార్యాలయాల్లో లేఖలు ఇచ్చినా స్వీకరిస్తామని సీఎం కేసీఆర్ విధించిన్ డెడ్ లైన్ చివరి రోజున ఆర్టీసీ యాజమాన్యం ప్రకటన చేసింది. 
 
ఈ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు ప్రత్యామ్నాయ కార్యాలయాల్లో లేఖలను అందజేశారు. ప్రత్యామ్నాయ కార్యాలయాల్లో అందజేసిన లేఖలు డిపో మేనేజర్లకు అందకపోవటంతో డిపో మేనేజర్లు లేఖలిచ్చిన కార్మికుల్లో కొంతమందిని విధుల్లోకి పిలవలేదు. అధికారులు వీరిని సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులుగానే పరిగణిస్తున్నారు. ఒక అధికారి ఈ అంశంపై మాట్లాడుతూ గడువులోపు  లేఖలు ఇచ్చి విధుల్లో చేరిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకున్నామని లేఖలు ఇవ్వనివారిని, లేఖలు ఇచ్చి విధుల్లో చేరని వారిని సమ్మెలో ఉన్న కార్మికులుగానే పరిగణిస్తామని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: