మాజీ మంత్రులు నారా లోకేష్, కింజరపు  అచ్చెన్నాయుడుల దూకుడుకు ముకుతాడు వేయనున్నారా. ఇకపై టీడీపీ విషయంలో కఠినంగా ఉండదలచారా. తద్వారా ముఖ్యమంత్రిపైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్న ఇతర విపక్ష నాయకులకు గట్టి హెచ్చరికలు పంపుతారా అంటే అవుననే అంటున్నారు. ఓ విధంగా ఇది టిట్ ఫర్ టాత్ లాంటిదే.


ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ విషయంలోఅ అసభ్య పదజాలంతో దూషించినందుకు గానూ సభా హక్కుల నోటీసులను జారీ చేయనున్నట్లుగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నారు. లోకేష్, అచ్చెన్నాయుడుతో పాటు, కూన రవికుమార్ కూడా స్పీకర్ ని  దారుణంగా దూషించారని ఆయన ఆరోపించారు.


ఈ వివరాలు తమ దగ్గర ఉన్నాయని, వాటి ఆధారంగా ఈ ముగ్గురికి నోటీసులు జారి చేసి మరీ సభా హక్కుల కమిటీ ముందుకు రప్పిస్తామని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రతి ఒక్కరు కాపాడాలని, రక్షించాలని ఆయన కోరారు. అదే విధంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ సహనం అవసరమని కూడా ఆయన అన్నారు.


ఇక ఏపీలో కొంతమంది విపక్ష నాయకులు ఏకంగా ముఖ్యమంత్రి జగన్ని టార్గెట్ చేసుకుని దిగజారి మాట్లాడుతున్నారు, వారి మీద కూడా వైసీపీ గురి పెట్టింది. సరైన సమయంలో వారిని కూడా సభా హక్కుల కమిటీ ముందుకు తెచ్చేలా యాక్షన్ ప్లాన్ రూపొందుతోంది. ఎందుకంటే వారు హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలకు పోతున్నారని వైసీపీ వాదిస్తోంది. మరి చూడాలి ఏపీ రాజకీయాల్లో ఈ నోటి దూకుడుకు కళ్ళెం పడుతుందా.


ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో ఆరోగ్యకరమైన రాజకీయాలు జరుగుతున్నాయా అన్నది మేధావులు, ప్రజాస్వామ్యప్రియుల ప్రశ్న. ఎంతసేపు వ్యక్తిత్వ హననం చేసుకుంటూ ఒకరిని ఒకరు కించపరుచుకుంటున్నారు. తప్ప ప్ర‌జా సమస్యలను ప్రస్తావించడంలేదని అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: