శబరిమల ఆలయంలోకి 10సంవత్సరాలనుండి 50సంవత్సరాలలోపు వయస్సు గల మహిళలకు ఆలయ ప్రవేశం లేదని ఇక్కడి చరిత్ర చెబుతోంది. అయ్యప్ప ఆజన్మబ్రహ్మచారి. ఈ ఆలయంతో సంబంధం ఉన్నవారు రుతుక్రమం అయ్యే బాలికలు, మహిళలకు ఈ ఆలయంలో ప్రవేశం లేదని చెబుతారు. రుతుక్రమంలో ఉన్న మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వస్తే గుడి అపవిత్రం అవుతుందని కథలు ప్రచారంలో ఉన్నాయి. 
 
కేరళ హైకోర్టు 1991 సంవత్సరంలో ఈ నిషేధానికి చట్టబద్ధత కల్పించింది. హైకోర్టు తీర్పుతో అన్ని వయస్సుల మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పించాలనే డిమాండ్ వినిపించింది. చరిత్రకారులు అయ్యప్పను వివాహం చేసుకోవటానికి ఒక యువతి సిద్ధం కాగా అదే సమయంలో ఏ సంవత్సరం కొత్త భక్తులు రారో ఆ సంవత్సరం వివాహం చేసుకుంటానని స్వామి యువతికి చెప్పినట్లు చెబుతున్నారు. 
 
కానీ ఆ తరువాత దీక్ష తీసుకున్న స్వాములు ప్రతి సంవత్సరం వస్తూనే ఉండటంతో అయ్యప్ప ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఆరోజునుండి అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవటానికి వచ్చిన యువతి అదృశ్య రూపంలో గుడి బయట ఉందని స్వామి భక్తులు నమ్ముతున్నారు. 2006లో మహిళలకు ఆలయ ప్రవేశం వివాదంపై కొంతమంది మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
2018 సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీంకోర్టు 10సంవత్సరాలనుండి 50సంవత్సరాల లోపు వయస్సు గల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం మత విశ్వాసాల్లో కోర్టు జోక్యం సరికాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై 65 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈరోజు ఈ కేసుకు సంబంధిన కీలక తీర్పును కోర్టు వెలువరించనుంది. ఈరోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడిస్తుంది. సుప్రీం కోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం కూడా పిటిషన్ వేయడం గమనార్హం. 




మరింత సమాచారం తెలుసుకోండి: