తెలంగాణ పాలిటిక్స్ లో భర్తల చేతులో కీలుబొమ్మలుగా మారిన ఓ ఇద్దరు మహిళా జడ్పీ చైర్మన్ల దీన స్థితి గురించి కథలు కథలుగా చెబుతున్నారు.జిల్లాకే అత్యున్నత పీఠం. జిల్లాకే తొలి మహిళగా గుర్తింపు,అదే జడ్పీ చైర్ పర్సన్ పదవి. అలాంటి పదవులను సీఎం కేసీఆర్ ఈసారి 50శాతం మహిళలకే కేటాయించారు. ఆ కోవలోనే ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని మంచిర్యాల జిల్లాకు జడ్పీ చైర్ పర్సన్ గా నల్లాల భాగ్యలక్ష్మీ,నిర్మల్ జిల్లాకు విజయలక్ష్మీలు జడ్పీ చైర్మన్ గా నియామకం అయ్యారు.


ఈ ఇద్దరిలో నల్లాల భాగ్యలక్ష్మీ చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే అయిన నల్లాలు ఓదెలు భార్య. బాల్క సుమన్ కోసం సీటును త్యాగం చేసిన ఓదెలును శాంతపరచడానికి ఆయన భార్యను జడ్పీ చైర్మన్ చేశారు కేసీఆర్ . కానీ ఇప్పుడు మంచిర్యాల జిల్లా రాజకీయాల్లో భాగ్యలక్ష్మీ డమ్మీ అయిపోయి నల్లాల ఓదెలే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిషత్ లో ఏం జరగాలన్నా.అభివృద్ధి కార్యక్రమాలు,అధికారుల బదిలీలు, అధికారులకు సమాచారాలు అంతా ఓదేలే ఇవ్వాల్సిందేనట. జడ్పీ సీఈవో నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఓదెలుకు జీహుజూర్ అనాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి.


ఇక నిర్మల్ జిల్లాలోనూ అదే పరిస్థితి. అక్కడ ప్రాథమిక సంఘం చైర్మన్ రాంకిషన్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మీ ఉత్సవ విగ్రహంలాగా ఉన్నారని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. చైర్మన్ కు బదులుగా అన్నింటిని రాంకిషన్ రెడ్డి పర్యవేక్షిస్తూ అధికారాన్ని చెలాయిస్తున్నాడట.

ఇలా భార్యలు పదవిలో ఉంటే భర్తలు అధికారం చెలాయిస్తున్న పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఆడవాళ్లు ముందుకు వెళ్తున్నారు అంటే ఏంటో అనుకుంటున్నాము కానీ దాని వెనకాల ఇలాంటివి ఉంటే అది వాళ్లని అణగతొక్కినట్లే అర్థం.


మరింత సమాచారం తెలుసుకోండి: