మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితి ఎంతో దారుణంగా తయారయింది. కనీసం యాభై వరకు అయినా సీట్లు వస్తాయి అనుకున్న ఆ పార్టీ కేవలం 23 సీట్లతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో అధికారాన్ని చేపట్టిన టిడిపి ప్రభుత్వం, ఇచ్చిన హామీలను చాలావరకు నెరవేర్చలేదని విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. అంతేకాక అప్పటి ఎన్నికల సమయంలో వారిచ్చిన ప్రధాన హామీలైన ఆంధ్రకు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చడం వంటివి మాత్రం పూర్తిగా ప్రక్కన పెట్టడంతోనే, ఈ ఎన్నికల్లో వారికి ఇంత అత్యల్ప స్థాయిలో సీట్లు వచ్చాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడడం జరిగింది. 

ఇకపోతే ఇటీవల టీడీపీ ఓటమి తరువాత ఆ పార్టీ ముఖ్య నేతలు కొందరు బిజెపి మరియు వైసీపీలో చేరడంతో, తలలు పట్టుకున్న అధినేత చంద్రబాబు, ఇటీవల ఆ వలసలు మరింతగా పెరగడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లు  సమాచారం. ఇకపోతే గత ఎన్నికల సమయంలో టిడిపికి వెన్నుదన్నుగా నిలిచిన గన్నవరం టిడిపి నేత వల్లభనేని వంశి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడం, అలానే దేవినేని అవినాష్, సాదినేని యామిని సహా మరికొందరు కూడా అతి త్వరలో ఆ పార్టీని వీడనున్నారు అనే సంకేతాలు వెలువడుతుండడంతో బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్నారు. 

ఇక మరోవైపు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తన కొడుకు లోకేష్ ను అన్నివిధాలా సిద్ధం చేసి, మలి ఎన్నికల సమయానికి మరోమారు ఎన్నికల బరిలో నిలుపుదాం అని భావిస్తున్న చంద్రబాబు ఆశలపై ఈ విధంగా ఆ పార్టీ నేతలు నీళ్లు చల్లుతున్నారని, ఇక ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చూస్తుంటే రాబోయే మరికొద్దిరోజుల్లో అధినేత చంద్రబాబు, ఆయన బావ బాలకృష్ణ, కుమారుడు లోకేష్ తప్పించి మరొకరు ఎవ్వరూ కూడా ఆ పార్టీలో ఉండే పరిస్థితి కనపడడం లేదని కొందరు బహిరంగంగానే సెటైర్లు వేస్తుండడం గమనార్హం. ఇదే కనుక జరిగితే మరికొద్దిరోజుల్లో టిడిపి మూతపడడం ఖాయం అనే వారు కూడా లేకపోలేదు. మరి అధినేత చంద్రబాబు తమ పార్టీ నుండి జరుగుతున్న వలసలను రాబోయే రోజుల్లో ఏ విధంగా అడ్డుకుంటారో చూడాలి...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: