కేరళ హైకోర్టు 1991లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశం నిషేధాన్ని చట్టబద్దం చేసింది. అయితే, 2006లో సుప్రీంకోర్టులో కేరళ హైకోర్టు తీర్పును ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోషియేషన్‌ సవాల్‌ చేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కులకు అది విఘాతమని వారు వాదించారు. దానిపై 2018 సెప్టెంబరు 28న విచారించిన సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.


స్త్రీ పురుషుల వివక్ష చూపడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు విరుద్ధమని.. మహిళల హక్కులకు ఇది విఘాతం కల్పిస్తుందని పేర్కొంటూ నిషేధాన్ని ఎత్తేసి అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రాతోపాటు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌లు మహిళలకు అనుకూలంగా తీర్పిచ్చారు.


అయితే, ధర్మాసనంలో ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మాత్రం దీనిని వ్యతిరేకించారు. దేశంలో లౌకిక వాతావరణాన్ని కొనసాగించాలంటే లోతైన అర్థాలున్న మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇకపోతే కేరళ ప్రభుత్వ చర్యలను భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. తీర్పును పునఃసమీక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో సుప్రీంకోర్టు రివ్వూ పిటిషన్లకు అనుమతించింది.


మొత్తం 64 మంది వేర్వేరుగా రివ్వూ పిటిషన్లు దాఖలు చేయగా ఫిబ్రవరి 6 వాదనలు ముగిసాయి. ఇక ఐదుగురు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేసు పునఃసమీక్షకు ధర్మాసనం అంగీకరించింది. ఇకపోతే అన్ని వయసుల మహిళలను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది. 3:2 మెజారిటీతో సమీక్ష పిటిషన్లు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఏడుగురు న్యాయమూర్తులు గల విస్తృత ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: