కేంద్ర రవాణా శాఖ పలు కీలక మార్పులకు శ్రీకారం చేపట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ గేట్లలో డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర సర్కార్ శ్రీకారం చేపట్టింది. డిసెంబర్ 1 నుంచి అన్ని టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీని ద్వారా టోల్ గేట్ల వద్ద సమయం ఆదాతో పాటు ట్రాఫిక్ లేకుండా వాహనాలు ముందుకు సాగనున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల పై 527 టోల్ గేట్లు ఉన్నాయి. ఇందులో 380 టోల్ గేట్లు ఫాస్టాగ్ విధానాన్ని కలిగి ఉన్నాయి. మిగిలిన 147 టోల్ గేట్లలో కూడా డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ విధానం అమలులోకి రాబోతుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ గేట్లలో ఫాస్టాగ్ విధానం అమలులోకి రానుంది. 


ఫాస్టాగ్ విధానం అంటే రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాల ఆధారంగా వాహనాల రాకపోకల నియంత్రణకు మార్గం సుగమం చేసే విధానం. ఇప్పటికే అధికారులు మై ఫాస్టాగ్, ఫాస్టాగ్ పార్ట్ నర్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ ను వాహనదారులు తమ బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకొని కొంత నగదును బ్యాంకులు, టోల్ ప్లాజాలో చెల్లిస్తే ఫాస్టాగ్ పేరుతోపాటు బార్ కోడ్ తో కూడిన స్టిక్కర్ ను ఇస్తారు. దీనిని వాహనం ముందు భాగంలో అద్దం పై బార్ కోడ్ కనిపించే విధంగా అతికించాలి. ఈ స్టిక్కర్‌ ఉన్న వాహనాల కోసం టోల్‌ ప్లాజా వద్ద ప్రత్యేకంగా మార్గాలను కేటాయిస్తారు.

ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ గేటుకు సుమారు 50 మీటర్ల దూరంలో టోల్‌ ప్లాజాకు చెందిన సిబ్బంది ఉంటారు. ‘ఫాస్టాగ్‌’ ఉన్న వాహనాలను మాత్రమే ఈ మార్గాల్లోకి అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్‌ గేటుపైన, కింద సీసీ కెమెరాలు ఉంటాయి. వాహనం గేటు వద్దకు వచ్చేలోగా దానికి ఉన్న ‘ఫాస్టాగ్‌ బార్‌ కోడ్‌’ను ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఈటీసీ) కెమెరాలు స్కాన్‌ చేస్తాయి. దీంతో గేటు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది. వాహనం ఆగకుండా వెళ్లిపోవచ్చు. 


దీని వల్ల సమయం, ఇంధనం ఆదా అవుతుంది. ట్రాఫిక్ లేకుండా వాహానాలు ముందుకు కదులుతాయి. టోల్ ప్లాజాల వద్ద నేరుగా డబ్బులు చెల్లించి కూడా ఫాస్టాగ్ స్టిక్కర్స్ తీసుకోవచ్చు. నెల నెల పాసులు కూడా తీసుకోవచ్చు. టోల్ గేటు వద్ద ఉదాహరణకు 12 గేట్లు ఉంటే 8 గేట్లు పాస్టాగ్ కోసం ఇక నుంచి వినియోగిస్తారు. 4 గేట్లు మాత్రమే సాధారణమైన వాహనాల కోసం తెరుస్తారు. ఫాస్టాగ్ విధానం ఉన్న వాహనాలకు పాత ఛార్జీలే అమలు చేయనున్నారు. ఫాస్టాగ్ విధానం లేకుంటే అదనంగా ఛార్జీలు వసూలు చేసి టోల్ ఫీజు వసూలు  చేస్తారు. కాబట్టి వాహనాదారులంతా వెంటనే ఫాస్టాగ్ విధానాన్ని చేయించుకోవాలని అధికారులు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ఖచ్చితంగా ఈ విధానాన్ని అమలు చేసి తీరుతామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: