మనం తీసుకునే ఆహారం, పళ్లు, కూరగాయలు.. తాజాగా ఉండాలని కోరుకుంటాం. మార్కెట్ లో దొరికే వాటిని కూడా శుభ్రంగా ఉన్నాయా లేదా కూడా చూస్తాం. కానీ.. వాటి వెనుక ఏం జరుగుతుందో మాత్రం మనం కనిపెట్టలేం. రసాయనాలు అధిక మోతాదులో వాడటం.. త్వరగా పండాలని కార్బైడ్ ఉపయోగించడం జరుగుతున్నాయి. ఇవి సంబంధిత అధికారుల తనిఖీల తర్వాత పరీక్షల్లో తేలుతూంటాయి. ప్రజారోగ్యాన్ని కొంతమంది వ్యాపారులు తమ స్వార్ధానికి బలి తీసుకుంటున్నారు.



మామిడి పండ్లనే తీసుకుంటే అవి పండాలంటే ఒకప్పుడు పచ్చ గడ్డిలో పెట్టి పండాక అమ్మేవారు. అరటిపండు గెలలు, పుచ్చకాయలు, ద్రాక్ష.. ఇలా ఏవి తీసుకున్నా ప్రామాణిక పద్ధతిలో పండించి వినియోగదారులకు అమ్మేవారు. కానీ.. నేడు పరిస్థితులు మారిపోయాయి. డబ్బు, ఆశ.. పెరిగిపోయాయి. రైతులు కష్టపడి పండించి వ్యాపారులకు అమ్మితే వారు చేసే పనులు ఇలా ఉంటున్నాయి. కార్బైడ్ తో మగ్గపెట్టిన పండ్లు తింటే క్యాన్సర్ వస్తుందని పరిశోధనల్లో తేలింది. గడ్డిలో మగ్గపెడితే పండటానికి కొన్ని రోజులు పడుతుంది.. అదే కార్బైడ్, ఆక్సిటోసిన్ అనే రసాయయనాలను ఆ పండ్ల మధ్య పెడితే తెల్లారేసరికి నిగనిగలాడే రంగుతో పండ్లు తయారైపోతున్నాయి. కానీ ఇవన్నీ మనిషి ఆరోగ్యాన్ని హరించడానికి సిద్ధమయ్యాయని మనకు తెలీదు. 



కొంతమంది అవినీతిపరులు చేస్తున్న ఈ దందాను తనిఖీల్లో అధికారులు పట్టుకున్నారు కూడా. కానీ.. కొన్ని చోట్ల ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మామిడి, బొప్పాయి.. ఏ ఇతర పండ్లు కొనుగోలు చేసేటప్పుడు వాటి రంగు నిగనిగలాడుతూ మెరుస్తూ ఉండకూడదు. కాయలపై సహజసిద్ధంగా ఉండే చిన్న చిన్న మచ్చలు ఉంటేనే అవి శాస్త్రీయ పద్ధతిలో పండినట్టు. రసాయనాలతో పండడం వల్ల క్యాన్సర్ కారకలు ఎక్కువగా ఉండి లేనిపోని రోగాలు కొనితెచ్చుకున్నట్టే. ఇటువంటి అవినీతి, అరాచకాలను అరికట్టడానికి ప్రభుత్వాలు మరింత కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: