బాలల దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ఒంగోలులో “మనబడి నాడు-నేడు” కార్యక్రమాన్ని  ప్రారంభించారు. గురువారం స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే… 


“నేటి బాలలే రేపటి పౌరులు. వారి భవిష్యత్ చాలా ముఖ్యం. వారు ఇంగ్లీషు మీడియం చదవకూడదా. కొంత మంది కావాలని పిచ్చి పిచ్చిగా అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. భావి ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీషు మీడియం అవసరం. ప్రపంచంతో పోటీ పడకుండా ఆపేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు. పేద పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవొద్దా. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ముందుకే పోతాను. నేడు ఈ వేదిక మీదుగా మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రతి స్కూల్ లో మరుగుదొడ్లు కట్టిస్తాం. నీటి సౌకర్యం కల్పిస్తాం. ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేస్తాం. ఇంగ్లీషు ల్యాబ్ లు ఏర్పాటు చేస్తాం. శిథిల వ్యవస్థలో ఉన్న బడుల స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తాం. టీచర్లకు కూడా ఇంగ్లీషు శిక్షణనిస్తాం. ఇంగ్లీషు మీడియం రాకతో సిలబస్ మారుతుంది. ఇది ఒక పెద్ద ఛాలెంజ్. దీనిని సవాల్ గా తీసుకొని ముందుకు పోతున్నాం. 


ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12వేల కోట్ల రూపాయలు కేటాయించాం. తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ది చేస్తాం. జనవరి 9న అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం. ప్రతి తల్లికి మీ అన్నగా, తమ్ముడిగా ఈ రోజు మాట ఇస్తున్నాం. మీ పిల్లలను కేవలం బడికి పంపించండి. వారిని బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15 వేల రూపాయలు అందజేస్తాం. ఓ మంచి నిర్ణయం తీసుకోకపోతే తల రాతలు మారవు. 25 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజిలు ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా పరిశ్రమలు నేరుగా ఈ కాలేజిలలో నుంచే ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. ప్రతి జిల్లాలో స్థానికులకు స్థానిక పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేస్తాం.” అని సీఎం జగన్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: