మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తర్వాత కూడా రాజకీయ మలుపులు కొనసాగుతున్నాయి. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపకల్పన కోసం కాంగ్రెస్, ఎన్సీపీ కమిటీ వేశాయి. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై అటు శివసేన, ఇటు బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేశాయి. 


గవర్నర్ భగత్ సింగ్ కోషియారి సిఫారసుతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చినప్పటికీ.. ఆయన నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది శివసేన. ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటుకు కలిసొచ్చే పార్టీలతో ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఉద్ధవ్ థాకరే రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ట్రిడెంట్ హోటల్‌లో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నేతలతో చర్చలు ప్రారంభించామనీ, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.  


ఉద్ధవ్‌తో కాంగ్రెస్ నేతల సమావేశంలో, మహారాష్ట్రంలో పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలును పరిశీలించి, కనీస ఉమ్మడి కార్యక్రమంపై చర్చించినట్టు సమాచారం. వీరి మధ్య సమావేశం సుమారు 50 నిమిషాల పాటు జరిగింది. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రకు శత్రువేమీ కాదని ఇప్పటికే శివసేన ప్రకటించింది. కనీస ఉమ్మడి కార్యక్రమం, 50-50 ఫార్ములాపై శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ మధ్య అవగాహన కుదరగానే మూడు పార్టీలు సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించడానికి పది మంది సభ్యులతో కమిటీని వేశాయి. 


మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. శివసేన అభ్యర్థే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారంటున్నారు శివసైనికులు. మరోవైపు బీజేపీ కూడా ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు ఆపలేదు. కొందరు బీజేపీ నేతలు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ అయ్యారు. అటు గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్న విపక్షాల వాదనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే ఇప్పటికీ సమయం ఉందన్నారు. తాము ఎన్నికల్లో శివసేనతో పొత్తు పెట్టుకుని పోటీచేశామనీ, కానీ ఇప్పుడు ఆ పార్టీ షరతులు ఆమోద యోగ్యం కాదని అమిత్ షా చెప్పారు. కూటమి గెలిస్తే ఫడ్నవీస్ సీఎం అవుతారని మోడీ, తాను ఎన్నికల ప్రచారంలోనే చెప్పామనీ, కానీ అప్పుడు మాట్లాడని శివసేన.. ఇప్పుడు పేచీ పెట్టిందని చెప్పుకొచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: