నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ప్ర‌శాంత్‌రెడ్డి అనుహ్యంగా కేసీఆర్ ఆశీస్సుల‌తో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. కేసీఆర్ త‌న‌య క‌విత చొర‌వ‌తోనే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో ఆయ‌న‌కు మంత్రివ‌ర్గంలోనూ మంచి ప్రాధాన్యం ద‌క్కింది. మంత్రివ‌ర్గంలోనే పిన్న‌వ‌య‌స్కుడు ఆయ‌న‌. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నాజిల్లాలోనే ఆయ‌న ప‌రిస్థితి కొంత బాగోలేద‌న్న సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. సీనియ‌ర్ ఎమ్మెల్యేల ముందు మంత్రిగారి మాట‌లు..ఆట‌లు సాగ‌డం లేదంట‌.  


సుధీర్ఘ‌కాలంగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలు...అనుభ‌వం.. అనుచ‌ర‌గ‌ణంతో ఉన్నా ఎమ్మెల్యేలు మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఆజ్ఞ‌లు..ఆదేశాలు ఎక్క‌డా అమ‌లు కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న ప్ర‌భావం ఏమాత్రం ప‌డ‌కుండా డేగ క‌ళ్ల‌తో త‌మ రాజ‌కీయ వేగులతో ప‌హారా కాయిస్తున్నార‌ట‌. ప్ర‌శాంత్‌రెడ్డికి కొన్ని అభివృద్ధి ప‌నుల‌కు మ‌ర్యాద పూర్వ‌కంగా కూడా ఆహ్వానించేందుకు స‌ద‌రు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఇష్ట‌ప‌డడ‌టం లేదు.


ఇలాంటి వ్య‌వ‌హారాల్లో  ఎలా ఉంటుందంటే...చొచ్చేదాకా సోమ‌లింగం...చొచ్చాకా రామ‌లింగం అన్న‌ట్లుగా ఉంటుంద‌ని...అందుకే ఎవ‌రూ ఎంత‌లో ఉండాలో..అంత‌లో ఉంటే మంచిద‌ని ఓ సీనియ‌ర్ త‌న అనుచ‌రుల వ‌ద్ద ప్ర‌శాంత్‌రెడ్డిని ఉద్దేశించి అన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాఖ్య‌లు ప్ర‌శాంత్‌రెడ్డి చెవిన ప‌డ‌టంతో ఆయ‌న కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించేందుకు జంకుతున్నార‌ట‌.


2014లో తొలిసారి ఎమ్మెల్యే గా విజ‌యం సాధించిన ప్ర‌శాంత్‌రెడ్డి రెండోసారి 2019లో కూడా మంచి మెజార్టీతో విజ‌యం సాధించారు. నిజామాబాద్ జిల్లా కు చెందిన పోచారం స్పీకర్ గా అయిపోవడం తో ఆయన స్థానంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కి మంత్రి ప‌ద‌వి ల‌భించింది.  2019 లో ప్ర‌శాంత్‌రెడ్డితో పాటు జిల్లాలో గెలిచిన 9మంది ఎమ్మెల్యేలు సీనియ‌ర్లే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో జూనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా వారూ ప్ర‌శాంత్‌రెడ్డిని లెక్కిస్తున్నార‌ట‌.అందుకే తమ నియోజకవర్గాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డిని కాలు కూడా పెట్టనివ్వడం లేదట.


ఒక‌రిద్ద‌రూ ఎమ్మెల్యేలు మాత్రం  ప్ర‌శాంత్‌రెడ్డిని త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించాల‌ని కోరుతూనే రాలేని ప‌రిస్థితులు క‌ల్పిస్తూ పొగ‌బెడుతున్నార‌ట‌. అయితే త‌నకు ఆప్త మిత్రుడైన కామారెడ్డి ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ  జిల్లా మంత్రిగా మ‌మ అనిపిస్తున్నార‌ట‌.  


మరింత సమాచారం తెలుసుకోండి: