ఏపిలో ఒకసమస్య తీరిన వెంటనే మరో సమస్య మొదలవుతుంది. అక్కడ ఇప్పుడు హట్ హట్‌గా నడుస్తున్న ఘాటు వార్త ఏంటంటే ఇసుక రాజకీయం. ఈ కీచులాటలో ఇప్పటివరకు అందరు తెరమీదికి వచ్చి తమ హాహా భావాలు పలికించి వెళ్లారు. చివరికి బాబుగారి పుత్రుడు కూడా ఓ చూపు చూసుకున్నాడు. అంతకు ముందే పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చంటూ ఇసుకమీద ధ్వజమెత్తాడు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పన్నెండు గంటల ఇసుక పరీక్ష రాయడానికి రెడి అయ్యాడు.


ఇకపోతే దీక్ష అంటే దేనికోసమైతే పోరాటం సాగిస్తున్నామో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేదాకా కొనసాగించాలి అంతే కాని సమ్మర్లో స్కూల్ పిల్లలకు బడి పెట్టినట్లుగా ఆరు గంటల దీక్ష అని, పన్నెండు గంటల దీక్ష అని, మనకు మనమే సమాధానం చెప్పుకుంటే మిగిలేది ఏం ఉండదు. కొంత పబ్లిసిటి తప్ప. ఇకపోతే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విజయవాడలో ఒక్కరోజు ఇసుక దీక్ష చేస్తున్నారు.


ఈ సందర్భంగా వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుందని, అప్పటి నుంచి రాష్ట్రంలో ఇసుక కొరత వచ్చిందన్నారు. దీంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక రోడ్డునపడ్డారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇసుక సమస్య పరిష్కరించాలని టీడీపీ తరఫున డిమాండ్ చేశామని, నిరసనలు తెలిపామని, ప్రతిపక్షాలు కూడా దీక్షలు చేశాయని అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని అందువల్ల  ఒక్క రోజు దీక్ష చేయనున్నామని చెప్పారు చంద్రబాబు.


ఇక విజయవాడలోని అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ దగ్గర వేదికపై దీక్ష చేపట్టడానికి ముందు ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల ఫోటోలకు నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులతో కలిసి వేదికపై దీక్షకు కూర్చున్నారు. ఇక మన సమాజంలో సాధారణంగా నాయకులకు ఉన్న లక్షణం ఏంటంటే అధికారంలో ఉన్ననాళ్లూ వారి కంటికి తమవారు చేస్తున్న అక్రమాలు, అరాచకాలు కనిపించవు. పదవి పోగానే ప్రతి పక్షంలోకి వచ్చి అధికారంలో ఉన్న వారి లోటు పాట్లు ఎత్తి చూపుతారు. ఇది జగమెరిగిన సత్యం.  


మరింత సమాచారం తెలుసుకోండి: