ఇసుక దీక్ష పేరుతో..రాజ‌ధానిలో...ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు హ‌డావుడి చేస్తున్న స‌మ‌యంలోనే....ఆయ‌న‌కు షాక్ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో టీడీపీ యువ‌నేత‌ దేవినేని అవినాష్, ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ కడియాల బుచ్చిబాబు వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని స్ప‌ష్టం చేశారు. ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరుతున్నానని తెలిపారు. ఆయన అడుగుజాడల్లోనే పార్టీలో నడుస్తానని, త్వరలోనే నెహ్రు అభిమానులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అవినాష్ ప్ర‌క‌టించారు.


దేవినేని అవినాష్‌ ఇవాళ తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంత‌రం వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. వచ్చేసారి కూడా జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యేందుకు సైనికుడిలా పని చేస్తానని అవినాష్ ప్ర‌క‌టించారు. ``మా వర్గం కార్యకర్తలకు నాయకులకు పార్టీలో అన్యాయం జరిగింది. ఎన్నిసార్లు చంద్రబాబునాయుడు దృష్టికి, లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు పట్టించుకోలేదు.. మా అభిమానులు కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మారను. `` అని ప్ర‌క‌టించారు.


తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించిన అవినాష్ ఈ సంద‌ర్భంగా త‌న‌ను టీడీపీలో టార్గెట్ చేశార‌ని తెలిపారు. ‘గత రెండు నెలలుగా మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో పలు సందర్భాల్లో నేను టీడీపీని వీడుతున్నాను అంటూ పలు వదంతులు వచ్చాయి. అవి వచ్చాయి అనడం కంటే సృష్టించబడ‍్డాయి అంటే సబబుగా ఉంటుంది. ఆ వదంతుల వెనుక ఎవరు ఉన్నారు అనేది పార్టీ అధిష్టానానికి పలుసార్లు విన్నవించడం కూడా జరిగింది.చెప్పిన ప్రతిసారీ తగిన న్యాయం చేస్తాం అని మీరు చెప్పినా వాస్తవ పరిస్థితుల్లో అది కార్యరూపం దాల్చకపోగా ఇక మీదట న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం కూడా ఏ కోశానా కనిపించలేదు`` అంటూ తెలుగుదేశం పార్టీలోని ప‌రిణామాల‌ను వివ‌రించారు. ``గత నలభై ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలబడి మమ్మల్ని నడిపిస్తున్న అనుచరుల మనోభావాలే మాకు అత్యంత ముఖ్యమయినవి. వారివల్లే  నేను కానీ మా కుటుంబం కానీ ఇక్కడ ఉన్నాం. నాకున్న హై కమాండ్‌  మా కుటుంబ అభిమానులు మాత్రమే అని మరొక్కసారి తెలియచేసుకుంటూ నా తెలుగు యువత అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.  `` అని స్ప‌ష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: