టీడీపీకి రాజీనామా చేసిన  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రోజు మీడియా సమావేశం ఓ విధంగా తెలుగుదేశం పార్టీ అంతర్గత పరిస్థితికి అద్దం పట్టింది. పార్టీలో చంద్రబాబు పాత్ర, ఆయన బలాలు, బలహీనతలు కూడా వంశీ మాటలద్వారా జనాలకు మరో మారు తెలిశాయి. అఖండమైన ప్రజాబలంతో గెలిచిన జగన్ మీద ఒంటి కాలు మీద లేచే చంద్రబాబుకు తమ్ముళ్ళు ఎంతటి మర్యాద ఇస్తున్నారో కూడా అర్ధమైపోయింది.


తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు బలం అంతా అధికారమే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రతిపక్షంలో  ఉంటే అసలు ఖాతరు చేయరని కూడా చెప్పకనే చెప్పేస్తున్నారు.  బాబు సొంతంగా ఏ రోజూ పార్టీని అధికారంలోకీ తీసుకురాలేదని వంశీ అనేశారంటే బాబు ఎంతటి స్థాయి నాయకుడో అర్ధమవుతోందిగా. పొత్తులుంటేనే టీడీపీ గెలుస్తోంది. లేకపోతే ఓడిపోతోంది అంటూ  వంశీ చేసిన కామెంట్స్ బాబుకు సూటిగా తగిలేవే. బాబు నాయకత్వంలో ఒంటరిగా వెళ్తే పార్టీ పని సరి  అని వంశీ ఎండగట్టేసారు.


మరి జగన్ వంశీని నానా ఇబ్బందులు పెడుతున్నాడని వేధిస్తున్నాడని నిన్నటి వరకూ వెనకేసుకొచ్చిన బాబు దీనికేమంటారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో బాబుకు తెలుసా. తెలిసినా వీలైనంతవరకూ ప్రతీదాన్ని తన రాజకీయాల కోసం బాబు ఉపయోగించుకుంటున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక బాబు అధికార వియోగం తట్టుకోలేకపోతున్నాడని, అధికార పార్టీకి కొంతకాలం సమయం ఇవ్వాలన్న కనీస ఆలోచన లేకుండా ఆందోళనలు  అంటున్నారని వంశీ కడిగిపారెశారు.


 ఓ విధంగా వంశీ పార్టీలో చంద్రబాబు వైఖరిని బాహాటంగానే ఎదిరించేశారు. మరి బాబు ఇపుడు ఏం చేస్తారు. వంశీ ఇంకా మా పార్టీ వాడేనని చెప్పగలరా. ఆయన ఇచ్చిన రాజీనామాను గవర్నర్ కు పంపి చర్యలు తీసుకోగలరా. పార్టీ నుంచి బహిష్కరించగలరా. బాబు ఇవేమీ చేయలేరని తెలిసే వంశీ ఇలా మీడియా ముఖంగా బాబుని గట్టిగా నాలుగు మాటలు అంటున్నాడనుకోవాలి. మరి బాబు ఈ బలహీనత తెలిసిన తరువాత మిగిలిన ఎమ్మెల్యే తమ్ముళ్ళు వూరుకుంటారా. తాను జగన్ తో కలసి అడుగులు వేస్తానని అంటున్న వంశీపై   చర్యలు తీసుకోకపోతే బాబు బదనాం అవుతారు, తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి. మరి బాబుకు ఇపుడు  గొప్ప ఇరకాటమే.


మరింత సమాచారం తెలుసుకోండి: