దేశ రాజకీయాలను కుదిపేసిన అంశం రాఫెల్‌. యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై అధికార, విపక్షం మధ్య పెద్ద వారే నడిచింది. వేలకోట్ల రుపాయలు స్కాం జరిగిందని కాంగ్రెస్‌..దేశ భద్రతను బయటపెట్టేందుకు కుట్ర చేస్తోందంటూ బీజేపీ..ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ఎన్నో ట్విస్టులు, మలుపులు తిరుగుతూ చివరికీ సుప్రీం కోర్టు వద్దకు చేరిందీ పంచాయితీ. ఇంతకీ వివాదానికి కారణమేంటీ..? ఒప్పందంలో ఏముంది..?


రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు 2002లోనే బీజం పడినా... 2007లో ఎయిర్‌క్రాఫ్ట్‌ కొనుగోలుకు ప్రతిపాదనలు కోరుతూ రక్షణశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రక్రియ ముందుకు సాగడానికి నాలుగేళ్లు పట్టింది. 2011లో రాఫెల్‌, యూరో ఫైటర్‌ జెట్‌లను ఎంపిక చేసింది ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌. రాఫెల్‌ యుద్ధ విమానాలను తక్కువ ధరకు ఇస్తామంటూ డసో సంస్థ ముందుకొచ్చింది. దీంతో 2014 మార్చిలో ఫ్రాన్స్‌ కంపెనీ డసో, హిందుస్థాన్‌ ఎరోనాటికల్‌ లిమిటెడ్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 108 యుద్ధ విమానాల తయారీ పనులను 70శాతం హాల్‌ పూర్తి చేయాల్సి ఉండగా.. 30 శాతం డసో సంస్థ పూర్తి చేయాలి.


2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్‌.. పాత ఒప్పందంలో మార్పులు చేర్పులు చేసింది. మొత్తం 36 రాఫెల్  యుద్ధవిమానాలకు ఫ్రాన్స్ సర్కార్‌తో ఒప్పందం చేసుకుంది. మొత్తం 58 వేల కోట్లు రుపాలు ఒప్పందంలో.. 15 శాతం నిధుల్ని అడ్వాన్స్‌గా చెల్లించాలి. మరో 20 శాతం నిధుల్ని భారత్‌లోని పరిశ్రమల నుంచి విడిభాగాల సేకరణకు, మరో 30 శాతం నిధులను వైమానిక, సైనిక పరిశోధన కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. ఇందుకోసం భారత ప్రభుత్వం ఎంపికచేసిన 75 సంస్థల నుంచి డసో తనకిష్టమైన దాన్ని ఎంచుకోవచ్చు.


2014 ఆగస్టు 8న రాఫెల్‌పై పార్లమెంట్‌లో ప్రకటన చేశారు అప్పటి రక్షణమంత్రి జైట్లీ. ఒక్కో విమానాన్ని 670 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఐతే  2016 నవంబర్‌లో పార్లమెంట్‌కు సమర్పించిన లెక్కల్లో ఆ ధర రెట్టింపుగా ఉంది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌కు 21 వేలకోట్ల మేరకు లబ్ధి చేకూర్చేందుకే నిబంధనలు మార్చారని కాంగ్రెస్‌ ప్రధాన ఆరోపణ. మోడీ ఒత్తిడితోనే రిలియన్స్‌తో ఒప్పందం జరిగిందని రాహుల్‌ ఆరోపించారు. అప్పటి విదేశీ వ్యవహారాల కార్యదర్శి జయశంకర్‌ ఫ్రాన్స్‌లో రఫేల్‌పై విలేకరులతో మాట్లాడిన రెండు రోజులకే డసోతో ఒప్పందం కుదిరింది. అందులో హాల్‌ ప్రస్తావనలేదు. జెట్ల సంఖ్య 126నుంచి 36కు తగ్గిపోయింది.


ఓ వైపు రాఫెల్‌పై దుమారం జరుగుతుంటే... ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలండే చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. భారత ప్రభుత్వమే రిలయన్స్‌ కంపెనీ సూచించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే దాన్ని ఎంచుకున్నామని తెలిపారు. హోలండే కామెంట్లను రక్షణశాఖ ఖండించింది. భాగస్వామి ఎంపికలో డసోకు పూర్తి స్వేచ్ఛ ఉందని, దానిపై భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల ఒత్తిళ్లు ఉండవని స్పష్టంచేసింది. ఈ వివాదం సుప్రీం కోర్టు వద్దకు చేరగా.. విచారణ జరపలేమని తీర్పునిచ్చింది. దేశ భద్రత విషయంలో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: