ఏపీలో శాండ్ ఫైట్ నడుస్తోంది. ఇసుక దుమారం తీవ్ర తుఫాన్‌గా మారింది. ఇసుకను దోచుకుంది మీరంటే మీరేనంటూ టీడీపీ, వైసీపీలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఇరు పార్టీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ సెగలు పుట్టిస్తున్నారు. 


ఇసుక అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ ధర్నా చౌక్‌లో 12గంటల పాటు దీక్షకు దిగారు. రాష్ట్రంలో ఇసుక కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపిస్తూ సర్కార్, సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. బాబు దీక్షకు జనసేన మద్దతు తెలిపింది.  మరోవైపు చంద్రబాబు దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి చేపట్టిన దీక్షకు అధికారపార్టీ నేతలు మద్దతు పలికారు.


టీడీపీ నేతలు ఐదేళ్లు ఇసుక తినే జీవించారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటున్న టీడీపీ నేతలు ... దమ్ముంటే ఆధారాలు చూపాలని పార్థసారథి సవాల్ విసిరారు. 


వైసీపీ నేతలు  ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారని బాబు ఫైర్ అయ్యారు. ఇసుకను దోచేస్తూ, ఆ నెపాన్ని అధికారులపై మోపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇసుక దోపిడీకి పాల్పడడం వల్లే టీడీపీ కనుమరుగైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుకను డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు దొంగ దీక్షలు ఆపాలని ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి.  


నిర్మాణరంగం ఆగిపోతే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో ముఖ్యమంత్రి కనీస ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి.  భవన నిర్మాణ కార్మికులు బతకలేని పరిస్థితి తీసుకొచ్చారంటూ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు సోమిరెడ్డి .  


సీఎం ఇసుక అక్రమ రవాణాపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ ఇసుక సమస్య సృష్టిస్తుందన్నారు వసంత. ఎవరి వాదనలు ఎలా ఉన్నా...ఇసుక పనులు ప్రారంభమై ఉపాధి దొరికితే చాలన్న ఆశాభావంతో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: