ఆర్టీసీ స‌మ్మెలో కీల‌క ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. దాదాపు 40 రోజులుగా జ‌రుగుతున్న స‌మ్మెలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికసంఘాల ప‌ట్టు విడుపులో...ఆర్టీసీ కార్మికులు మ‌రో మెట్టు దిగారు.  హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేయ‌డం... సమ్మె అంశం లేబర్‌ కమిషనర్‌ పరిధిలో ఉన్నందున ప్రస్తుత దశలో హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు అంగీకరించలేమని బుధవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ సీఎస్‌ ఎస్కే జోషి తన అఫిడవిట్‌లో పేర్కొన్న నేప‌థ్యంలో..ఆర్టీసీ కార్మికుల జేఏసీ కన్వీనర్ అశ్వ‌త్థామ‌రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్ర‌క‌టించారు.


హైద‌రాబాద్‌లో అశ్వ‌త్థామ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....త‌మ నిర్ణ‌యానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించారు. ఆర్టీసీ అంశంపై కోర్ట్ తీర్పు 18 వ తేదీకి వాయిదా పడిందని మరోవైపు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను అక్రమ అరెస్టులు చేస్తోందని తెలిపారు. ఈ నేప‌థ్యంలో...సేవ్ ఆర్టీసీ పేరుతో రేపటి నుండి డిపోల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆర్టీసీ కార్మికులు అత్మస్తైర్యం కోల్పోవద్దని, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞ‌ప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు అండగా ఉన్నాయని, ప్రజల మద్దతు కూడా సంపూర్ణంగా కావాలని తెలిపారు. ఈ నెల 15 న తేదీన గ్రామ గ్రామానికి బైక్ ర్యాలీ నిర్వహిస్తామని వివ‌రించారు. 16వ తేదీ జేఏసీ కన్వీనర్ అయిన త‌న‌తో పాటు కో కన్వీనర్ రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక దీక్ష చేపడుతున్నామని వెల్ల‌డించారు. 17, 18 న సామూహిక నిరాహారదీక్షలు నిర్వహిస్తామని . ప్రతి డిపో ముందు 50 మంది వరకు ఆర్టీసీ కార్మికులు నిరాహారదీక్ష చేపడుతారని ప్ర‌క‌టించారు. 19 వ తేదీన సడక్ బంద్ పేరుతో హైదరాబాద్ నుండి కోదాడ వరకు ర్యాలీ నిర్వహిస్తామని ప్ర‌క‌టించారు.


ఇలా ఓ  వైపు త‌మ కార్యాచ‌ర‌ణ కొన‌సాగిస్తూనే...మ‌రోవైపు చ‌ర్చ‌ల కోసం తాము ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకునేందుకు ఓ మెట్టు దిగుతున్న‌ట్లు ఆర్టీసీ కార్మికుల జేఏసీ కన్వీనర్ అశ్వ‌త్థామ‌రెడ్డి వెల్ల‌డించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని ప్ర‌భుత్వం చెప్తోంద‌ని అయితే, తాము నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఉన్నామ‌ని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నందున ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా చ‌ర్చించాల‌ని ఆయ‌న కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: