ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం మారానుందా? అంటే సోము వీర్రాజు వ్యాఖ్యలని బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. ఇక 23 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇక జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అయితే చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, త్వరలోని వారు బీజేపీలోకి వచ్చేస్తారని ఆ పార్టీ నేతలు తెగ ప్రచారం చేస్తున్నారు. అలా ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్న ఏ ఎమ్మెల్యే కూడా బీజేపీలోకి వెళ్లలేదు.


కాకపోతే నలుగురు రాజ్యసభ సభ్యులు, మాజీ నేతలు మాత్రం కాషాయ కండువా కప్పుకున్నారు. కానీ తాజా పరిణామాలని చూస్తుంటే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్లిపోవడం దాదాపు ఖాయమైపోయిందని తెలుస్తోంది. తాజాగా గంటాతో భేటీ అయిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ సందర్భంగా గంటాతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారని, టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని వీర్రాజు వ్యాఖ్యానించారు.


అలాగే గంటా సారథ్యంలో ఏకంగా ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాసనసభపక్షాన్ని తయారుచేసేందుకు పావులు కదుపుతున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాలు నిజమైతే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోయి బీజేపీకి వస్తుంది. అయితే ఇక్కడ తమ పార్టీలోకి వచ్చే నేతలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ రూల్ పెట్టారు. మరి బీజేపీలోకి వెళ్ళేవారి పరిస్థితి ఏంటో అర్ధం కాకుండా ఉంది. బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళితే చంద్రబాబు సైలెంట్ గా ఉండే అవకాశముంది.


ఎందుకంటే బాబు ఎలాగో బీజేపీతో సఖ్యత కోరుకుంటున్నారు. అలాగే జగన్ కూడా ఏం చేయలేకపోవచ్చు. టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకున్నట్లే ఎమ్మెల్యేలని కూడా విలీనం చేసుకుంటే...జగన్ కు కూడా మాట్లాడే అవకాశం లేదు. పైగా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సిన అవసరముంది కాబట్టి మెదలకుండానే ఉంటారు. మొత్తానికైతే టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళితే అసెంబ్లీలో ప్రతిపక్షం మారడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: