మళ్ళీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు మొన్న ఎన్నికల్లో అనేక వ్యూహాలతో ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల్సిన వారిని ఎంపీలుగా బరిలోకి దించడం, కొన్ని చోట్ల పాతవారిని పక్కనబెట్టి కొత్తవారికి చోటు ఇవ్వడం, కొందరు ఎమ్మెల్యేలకు వేరే నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వడం లాంటివి చేశారు. ఈ నేపథ్యంలోనే 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి కొవ్వూరు నుంచి గెలిచి మంత్రిగా పని చేసిన జవహర్ బాబుకు....2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లా తిరువూరు సీటు ఇచ్చారు. అయితే ఆయన అక్కడ ఘోరంగా ఓడిపోయారు.


అటు బాబు వ్యూహాలన్నీ ఫెయిలయ్యి రాష్ట్రంలో టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది. ఇక జవహర్ తిరువూరులో ఓడిపోయిన పార్టీలో యాక్టివ్ గానే తిరుగుతున్నారు. అధికార వైసీపీ మీద విమర్శల దాడి కూడా చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్న ఆయనకు మాత్రం తిరువూరులో ఉండటం ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. ఆయన తిరిగి కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్లిపోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.


తిరువూరులో టీడీపీ ఓడిపోవడం ఇది నాలుగోసారి. అంతకముందు నల్లగట్ల స్వామీదాసు మూడు సార్లు ఓడిపోయారు. దీంతో ఇలా టీడీపీ వీక్ గా ఉన్న చోట జవహర్ ఉండాలని అనుకోవడం లేదు. కొవ్వూరు అయితే టీడీపీకి కంచుకోటగానే ఉంది. మొన్న ఎన్నికల్లో కొవ్వూరు నుంచి వంగలపూడి అనిత పోటీ చేసి ఓడిపోయారు. అనిత 2014 లో విశాఖ పాయకరావుపేట నుంచి గెలిచారు. ఇప్పుడు ఆమె పాయకరావుపేటపై ఎక్కువ ఫోకస్ పెడుతుండటంతో, జవహర్ కొవ్వూరు వైపు చూస్తున్నారు.


కొవ్వూరు అయితేనే తనకు అండగా ఉంటుందని, గతంలో మంత్రిగా కూడా కొవ్వూరులో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కొందరు టీడీపీ శ్రేణులు కూడా జవహర్ వచ్చేస్తేనే బాగుంటుందని అనుకుంటున్నారు. దీంతో జవహర్ కొవ్వూరు వెళ్లడానికి అధిష్టానం పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి జవహర్ తిరువూరులో జెండా పీకేసి కొవ్వూరు ఎప్పుడు వెళతారో?


మరింత సమాచారం తెలుసుకోండి: