రోజు రోజుకు ఆన్‌లైన్‌లో మోసాలు జరుగుతున్నాయని ఒకవైపు పోలీసులు, మరోవైపు మీడియా జోరుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు.. అయినా గాని మోసపోయే వారు మోసపోతూనే ఉన్నారు. మోసం చేసే వారు చేస్తూనే ఉన్నారు. ఇది ఈనాటి లోకం పోకడ. ఇక అన్ని తెలిసి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ కూడా మోసపోయే వారిని నిజంగా ఏమనాలో అర్దం కాదు. జేబులో పది రూపాయలుంటేనే ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది బ్యాంకులో లక్షల్లో సొమ్ము పెట్టుకుని మరెంతగా జాగ్రత్తగా ఉండాలి.


చిన్న అజాగ్రత్త వల్ల ఉన్న సొమ్మునంతా సైబర్ నేరగాళ్ల పాలు చేస్తున్నారు. ఇలాంటి సాఫ్ట్ మోసం ఒకటి జరిగింది. బాధ పెట్టకుండా మంచి మాటలతో 4లక్షల రూపాయలను దోచేసుకున్నాడు ఓ నేరగాడు. ఇక వివరాలు తెలుసుకుంటే లక్నోలోని గొమ్తినగర్‌ కు చెందిన ఓ యువకుడు బుధవారం ఓ ప్రముఖ పుడ్‌ డెలివరీ యాప్‌ ద్వారా పుడ్‌ ఆర్డర్‌ చేశాడు. కాసేపటికి ఆ ఫుడ్ క్వాలిటీ సరిగా లేదనుకొని ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నాడు.


ఈ క్రమంలో తను చెల్లించిన డబ్బులను తిరిగి పొందడం కోసం ఆన్‌లైన్‌లో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ను వెతికి కాల్‌ చేశాడు. అతని ఫోన్ రిసీవ్ చేసుకున్న అతను ఇతని సమస్యను విని  ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేసిన డబ్బులు చెల్లించాలంటే అందుకోసం తాము పంపే ఒక లింక్‌ను క్లిక్‌ చేసి మరో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. అతని మాటలు నమ్మిన ఆ వ్యక్తి వెంటనే ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని దాంట్లో బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను పొందుపరిచాడు.


ఆ తర్వాత ఓటీపీ రాగా, అది ఎంటర్‌ చేస్తే డబ్బులు రిఫండ్ అవుతాయని నమ్మించి, ఆ యువకుడితో ఓటీపీని ఎంటర్‌ చేపించాడు. ఇంకేముంది చీటి చినిగింది. వెంటనే అతని అకౌంట్‌లో ఉన్న రూ.4లక్షలు విత్‌ డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో కంగారు పడ్డ ఆ యువకుడు మరలా ఆ నెంబర్‌కు కాల్‌ చేయగా.. ఎటువంటి  స్పందన లేదు. 4లక్షలు పోతేగాని మోసపోయానని తెలుసుకోలేనంతగా అజ్ఞానంలో ఉన్న ఈ యువకుడు స్థానిక పోలీసు స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేశాడు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన చూస్తే ఓ సామేత గుర్తుకు వస్తుంది. నేలమీద పడిన పాలను తిరిగి తీసుకోగలమా చెప్పండి. అవి మనవి కాదని వదిలేయడం తప్ప చేసేది ఏముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: