క్రెడిట్ కార్డు అనేది స్టేటస్‌కు సింబల్‌గా మారింది. ఇప్పుడున్న పరిస్దితుల్లో ప్రతివారు చాలా ఎక్కువగా విచ్చల విడిగా క్రెడిట్ కార్డులను ఉపయెగిస్తున్నారు. బ్యాంకులు కూడా తమ టార్గెట్ చేరుకోవడానికి విరివిగా కార్డులను జారీ చేస్తున్నాయి. ఇక్కడే చిక్కువచ్చింది. క్రెడిట్ కార్డులు ఉండటం ముఖ్యం కాదు. వాటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయే, అంతేస్థాయిలో చిక్కులు కూడా ఎదురుకావొచ్చు. ముఖ్యంగా క్రెడిట్ కార్డులను ఇష్టానుసారంగా ఉపయోగిస్తే రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని గ్రహించండి.


ఇకపోతే డబ్బును వెనుకా ముందు చూడకుండా ఎక్కువగా ఖర్చు చేసేవారు క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండటం మేలు. ఎందుకంటే సమయానికి తీసుకున్న లోన్ కట్టకుంటే క్రెడిట్ స్కోర్ దెబ్బతినొచ్చు. దీనివల్ల భవిష్యత్‌లో లోన్ కోసం అప్లై చేసుకుంటే లోన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదముంది. ఇక మీరు గమనించవలసిన విషయం ఏంటంటే క్రెడిట్ కార్డులపై, నెలకు 3 నుంచి 4 శాతం అంటే సంవత్సరానికి 36 నుంచి 48 శాతం మధ్యలో వడ్డీ ఉంటుంది. ఇది చాలా ఎక్కువ.


దైనందిన ఖర్చులకు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నప్పుడు టైమ్ బాగోలేకపోతే క్రెడిట్ రివాల్వింగ్ కష్టతరం కావొచ్చు. దీని కారణంగా మెల్ల మెల్లగా రుణ సమస్యల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇక కొంత మంది కరెక్ట్ టైమ్‌కు బిల్లులు చెల్లించరు. ఇలాంటి వారు క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండటం మంచిది. పేమెంట్ డెడ్‌లైన్ దాటిపోతే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీంతో క్రమంగా చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూ వస్తుంది. దీని వల్ల వారి కుటుంబం కూడా ఆర్ధికంగా ఇబ్బంది పడవలసి వస్తుంది.


ఇకపోతే చాలా మంది చేసే తప్పు ఏంటంటే మినిమిమ్ అమౌంట్ చెల్లిస్తే అదనపు చార్జీల భారం ఉండదని భావిస్తూ ఉంటారు. అయితే ఇది నిజం కాదు. మీరు చెల్లించని మొత్తానికి వడ్డీ మాత్రం మీ అకౌంట్‌కు జమవుతూ వస్తుంది. కాబట్టి మీరు చెల్లించవలసిన దాన్ని మొత్తంగా చెల్లించడం ఉత్తమం. ఇంతే కాకుండా కార్డులను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇలాంటి అలవాటు లేని వారు వీటికి దూరంగా ఉండటం మంచిది. లేదంటే మోసగాళ్ల బారిన పడి నిండా మునగవలసిన పరిస్దితులు తలెత్తుతాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: