మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ మాయల ఫకీర్‌ అని, దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.  మండలంలోని జొన్నవాడ ఇసుకస్టాక్‌ యార్డు వద్ద గురువారం ఆయన ఇసుక వారోత్సవాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు బాగా కురవడంతో నదులు, రిజర్వాయర్లు నిండి జలకళ సంతరించుకుందన్నారు. ఈ నేపథ్యంలో నదుల్లో ఇసుక తీయడం కష్టతరంగా మారిందన్నారు.

కనీసం ఈ మాత్రం జ్ఞానం లేని చంద్రబాబునాయుడు ఇసుకదీక్ష పేరిట డ్రామా ఆడడం ఆరోపణలు చేయడం అవివేకమన్నారు.టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడి ఇంటి పక్కనే అనుమతులు లేకుండా ఇసుకను లారీల్లో తరలించారన్నారు. చంద్రబాబు, లోకేష్‌, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ వ్యాపారం జరిగిందన్నారు.అటువంటి నీచమైన చరిత్ర ఉన్న చంద్రబాబునాయుడు నేడు ఇసుకదీక్ష పేరిట కొత్తనాటకానికి తెరలేపాడని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు కార్మికులపై లేనిపోని ప్రేమ ఒలకబోయడం విడ్డూరంగా ఉందన్నారు. 


అటువంటి వ్యక్తి నేడు కార్మికుల విషయంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కార్మికశాఖా మంత్రిగా అచ్చెనాయుడు ఏం ఉద్దరించాడో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక చంద్రబాబునాయుడి దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌ తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పిచ్చిప్రేలాపనులు మానుకోవాలని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలు 151 మందిని విమర్శించే స్థాయి నీకెక్కడిదని ప్రసన్నకుమార్‌ రెడ్డి విమర్శించారు. 


ఇసుక అక్రమ రవాణా విషయంలో టీడీపీ నేతలు విడుదల చేసి చార్జిషీట్‌ అంతా బోగస్‌ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. తమ నాయకులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, కొండూరు వెంకటసుబ్బారెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి పేర్లు పెట్టారని వారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. సూరా శ్రీనివాసులురెడ్డి బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లు రీచ్‌కు సంబంధించి భాగం ఉన్నది వాస్తవమేనన్నారు. అయితే ఇక్కడ గుప్పెడు ఇసుక కూడా అక్రమ రవాణా జరగడం లేదనే విషయం టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: