మోదీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక అశాంతి, అసంతృప్తి నెలకొన్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వెల్లడించారు. పోలీసుస్టేషన్‌లో ఉండాల్సిన పోలీసులు బస్‌ డిపోలు, రెవెన్యూ కార్యాలయాల ముందు ఉంటున్నారని ఆరోపించారు. బస్సుల్లో తిరగాల్సిన డ్రైవర్‌, కండక్టర్‌ చౌరస్తాల్లో ఆందోళన చేస్తున్నారు అని చెప్పారు. ఆర్టీసీ కార్మికు బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని అయిన ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రభుత్వ ఉద్యోగులపై భుజంపై తుపాకీ పెట్టి ఆర్టీసీ కార్మికులను కాల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రం పూర్తిగా దివాళా తీస్తుందని, సంక్షేమ కార్యక్రమాలు అటకెక్కుతున్నాయని దుయ్యబట్టారు. మీకు దమ్ముంటే ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. 41 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా వారిని పట్టించుకోని కేసీఆర్‌ రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడ వారికి మద్దతు తెలుపుతారో అని భయపడి వారితో చర్చలు జరపడం విడ్డూరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రసుత్త పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా భావిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఆదివాసీ నేత తాటి కృష్ణ లక్ష్మన్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.


రాఫెల్‌పై  రాహుల్‌ గాంధీ చేస్తున్న ఆరోపణలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని  లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాఫెల్‌ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ తన కాళ్లకు బలపం కట్టుకొని తిరిగి బీజేపీ నేతలపై బురద జల్లే ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఇప్పటికైనా రాహుల్‌గాంధీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, తన కుటిల బుద్దిని మానుకోవాలని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: