జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేయనున్నారు. ఇసుక పై పోరాటం ముగిసిన తర్వాత ఆయన యురేనియం అంశంపై దృష్టి సారించబోతున్నాడు. ఏకంగా సీఎం జగన్ సొంత నియోజక వర్గం పులివెందులను టార్గెట్ చేయబోతున్నారు. జనసేన పొలిట్‌బ్యూరో సభ్యులు, నేతలు పులివెందుల పర్యటనకు వెళ్తారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. యురేనియం తవ్వకాలతో అక్కడి ప్రజల జీవితాలు నాశనమైపోతున్నాయంటున్నారు పవన్ కల్యాణ్..


పులివెందుల వెళ్లి.. అక్కడి సమస్యను అధ్యయనం చేసి వాళ్లకి ఎలా న్యాయం చేయాలో చూద్దామంటున్నారు. పులివెందుల యాత్ర ద్వారా నేరుగా జగన్ ను టార్గెట్ చేయడం పవన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. వైకాపా నేతల సంస్కారంపై తాను చేసిన వ్యాఖ్యలకు బొత్స సత్యనారాయణ బాధపడిపోతున్నారన్న పవన్.. ముందు మీ నాయకుడికి ఎలా మాట్లాడాలో చెప్పండని సలహా ఇచ్చారు. విడిపోయిన వారి జీవితాలపై మాట్లాడటానికి ఇంగితజ్ఞానం లేదా.. అంటూ పవన్ ప్రశ్నించారు.


మట్టిలో కలిసిపోతారనే మాటను నేను ఆవేశంలో అనలేదు.. తెలుగుభాషను మీరు అగౌరవపరిస్తే మట్టిలో కలిసిపోతారని మళ్లీ చెబుతున్నా అంటూ అదే డైలాగ్ పునరుద్ఘాటించారు. భాషల్ని గౌరవించే సంప్రదాయం మా పార్టీది అన్న పవన్.... అవినీతిపై రాజీలేని పోరాటమంటే నవ్వుతారని నాకు తెలుసన్నారు. అవినీతిపై పోరు ఎప్పటికీ గెలవని పోరాటమని తెలుసు... కానీ ప్రయత్నం చేయాలి కదా అన్నారు పవన్..


ఇసుక కొరతపై గవర్నర్‌కు 18 పాయింట్లతో నివేదిక ఇచ్చామని... ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వారిపై గూండా చట్టం, జైలుశిక్ష విధించాలని పెట్టామని పవన్ వివరించారు. మేము గవర్నర్ వద్ద ప్రస్తావించిన అంశాన్నే నిన్న ప్రభుత్వం ఆమోదించిందని పవన్ గుర్తు చేశారు. మొత్తం మీద ఏపీ సీఎం జగన్ పై గట్టి పోరాటానికే పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. మరి ఇది ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: