చంద్రబాబు ఇసుక దీక్ష వేళ నారా లోకేశ్ అదరగొట్టారు. తన సహజ ప్రవర్తనకు భిన్నంగా ఆవేశంగా స్పీచ్ దంచేశారు. అంతే కాదు.. జగన్ డౌన్ డౌన్.. సీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తే కేసు పెట్టి జైల్లో పెట్టారని.. ఇప్పుడు తాను డౌన్ డౌన్ అంటున్నానని.. ఏం చేస్తారో చేసుకోండి.. ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ గర్జించే ప్రయత్నం చేశారు నారా లోకేశ్.


ఉచిత ఇసుక విధానం అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు దీక్షను చూసే ప్రభుత్వం వారోత్సవాలు ప్రకటించిందని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు 46మంది ఇసుక సమస్య వల్ల ఆత్మహత్య చేసుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ వస్తూ వస్తూనే పథకాలు రద్దులు మీద రద్దుచేశారని, మరుగుదొడ్ల కు పార్టీ రంగు పూయటమే జగన్ కు మిగిలిందని మండిపడ్డారు.


ఇవాళ ఏ పందికొక్కులు ఇసుక డబ్బు తింటున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే మంత్రులు ఎగతాళి చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల వల్ల ఇసుక రేట్లు పెరుగుతున్నాయని మరో మంత్రి అంటున్నాడని,ఇది చేతకాని ఆంబోతు ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు చేసిన లోకేష్ ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండంటూ సవాలు విసిరారు.


లోటు బడ్జెట్‌లోనూ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన నాయకుడు చంద్రబాబు అంటూ తన తండ్రి పాలనను కీర్తించారు. ఉచిత ఇసుక విధానం అమలయ్యే వరకు పోరాటం ఆగదన్న లోకేశ్... ఎక్కడా పనులు దొరకడం లేదని కార్మికులు చెబుతున్నారన్నారు. ఇప్పటివరకు 46 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని లోకేశ్ లెక్క చెప్పారు.


ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలను కలిశానని... కార్మికుల తరపున మాట్లాడితే కేసులు పెడుతున్నారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి.. కార్మికుల కుటుంబాలకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలి.. పాత ఇసుక విధానం అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాం.. ఉచిత ఇసుక విధానం అమలుచేసే వరకు పోరాడదాం.. అంటూ ప్రసంగించారు లోకేశ్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: