తెలుగు యువ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్యలో 'వాటర్ వార్' నడవనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజా గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కేంద్రం జాతీయ హోదా ఇస్తే ఊరుకునేది లేదు అంటూ సుప్రీం కోర్టు లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా, విచక్షణా రహితంగా తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని పరిశీలించొద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.


మరో వైపు పోలవరం లో తెలంగాణ రాష్ట్రాన్ని మరో పార్టీ గా పరిగణించాల్సిన అవసరం లేదని ఎందుకంటే తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేయడంతో అభ్యంతరాలు చెప్పే హక్కు లేదని పేర్కొంది. విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందని తెలంగాణ భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వ అఫిడవిట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.


కృష్ణా బేసిన్‌లో 180 టీఎంసీలకు పైగా వినియోగించుకునేలా పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు ప్రాజెక్టులు...450 టీఎంసీల నీటి వినియోగం నిమిత్తం కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకం తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులు చేపట్టింది. రీఇంజినీరింగ్‌ పేరుతో కాళేశ్వరం చేపట్టినట్లు చెబుతోంది. ఇది ముమ్మాటికీ నూతన ప్రాజెక్టే. తెలంగాణ నూతన ప్రాజెక్టుల వల్ల పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అపెక్స్‌ కౌన్సిల్‌ ముందు ఈ అంశాలు పెట్టాలని పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల పరిధిలోని రైతులను విస్మరించి పక్షపాతంతో కాళేశ్వరం పనులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు’ అని ఏపీ అఫిడవిట్‌లో పేర్కొంది.


ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కొలువు తీరాక తెలంగాణ ప్రభుత్వం పై ఇలా విరుద్ధం గా అఫిడవిట్ దాఖలు చేయడం ఇదే మొదటసారి. ఇక ఏపీ ప్రభుత్వ కౌంటర్ కు కెసిఆర్ సర్కార్ ఎలా ప్రతి స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: