శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం ఎదో ఒక స్పష్టత ఇస్తుందని అందరూ భావించినా, చివరికి ఈ అంశం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. కానీ దీనిపై మరింత లోతైన విచారణ జరగాలని అభిప్రాయపడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలని పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబరు 28 న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం అందరికి తెలిసిందే.


ఇది ఇలా ఉంటే, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గత ఏడాది చోటు చేసుకున్న అలజడులను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో న్యాయ మూర్తులను సంప్రదించాలని నిర్ణయించింది. నవంబరు 17 నుంచి మండల పూజలకు ఆలయం తెరుచుకోనుండగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు విషయంలో న్యాయసలహా తీసుకుంటామని అయన ప్రస్తావించారు.


సుప్రీం కోర్టు ఉత్తర్వుల విషయంలో ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే మహిళలకు ఆలయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టంగా  తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ఏవైనా సరే అమలు చేసేందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీడియాతో తెలిపారు. కొన్ని అంశాల విషయంలో అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సి అవసరం ఉందని విజయన్ ఈ సందర్బంగా వివరించారు. గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు ఎలాంటి స్టే విధించలేదని ఆయన తెలియ చేశారు.


సుప్రీంకోర్టు నిర్ణయంపై అఖిల భారత శబరిమల కర్మ సమితి సంతోషం వ్యక్తం చేసింది. ఇది భారతీయులు, అయ్యప్ప భక్తులు సాధించిన విజయంగా చెప్పుకొచ్చింది. సుప్రీం తీర్పును గౌరవించి మహిళలు శబరిమలలోకి వెళ్లే ప్రయత్నం విరమించుకోవాలని తెలిపింది. అన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై మరింత లోతుగా విచారణ జరగాలన్న సుప్రీంకోర్టు అభిప్రాయం సరైందేనని పేరుకొంది. కోర్టు తీర్పు సంతోషకరమని, కేరళ వ్యాప్తంగా ఆలయాల్లో దీపాలను వెలిగించి దీనిని సంబరాలు జరుపుకుంటామని శబరిమల కర్మ సమితి తెలియ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: