త‌న తిక్క నిర్ణ‌యాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌వ‌ర‌పాటుకు కార‌ణం అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కుర్చీకి ఎస‌రు వ‌చ్చింది. అధికార దుర్వినియోగం చేసినందుకు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని డెమోక్రాట్లు డిమాండ్‌ చేశారు. దీంతో ట్రంప్‌ అభిశంసన తీర్మానంపై హౌస్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ బుధవారం తన తొలి విచారణను చేపట్టింది. ఈ ప్రక్రియను 13 మంది డెమోక్రాట్లు, 9 మంది రిపబ్లికన్లు.. మొత్తం 22 మంది హౌస్‌ మెంబర్లతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తోంది. 


వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ నేత, మాజీ ఉపాధ్యక్షుడు జోసెఫ్‌ ఆర్‌.బిడెన్‌ నుంచి ట్రంప్‌ కు గట్టి పోటీ ఎదురుకానున్నది. దీంతో జోసెఫ్‌ను దెబ్బకొట్టేందుకు ట్రంప్‌ ఉక్రెయిన్‌ సాయం కోరినట్టు ఆరోపణలు వచ్చాయి. అందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్‌ ఆర్ధిక సాయం అందించేందుకు కూడా ట్రంప్‌ సిద్దమయ్యాడు. బిడెన్‌ తో పాటు అతని కుమారుడిపై ఉన్న కేసులో విచారణ వేగవంతం చేయాలని ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ జెలెన్‌ స్కీ ని ఫోన్‌ లో కోరారని ట్రంప్‌ విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఈ విషయాలన్నీ నిఘా వర్గాలు వెలుగులోకి తేవడంతో ట్రంప్‌ అధ్యక్ష పదవికి, దేశ భద్రతకు, ఎన్నికల విశ్వసనీయతను విస్మరించడాని డెమోక్రాట్‌ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టానికి ఎవరు అతీతులు కాదంటూ అభిశంసనకు ప్రక్రియకు కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. తొలిరోజు విచారణలో ఉక్రెయిన్‌ తాత్కాలిక రాయబారి విలియం బీ.టేలర్‌ జూనియర్‌ అలాగే యూరోపియన్‌ యురేషియన్‌ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జార్జ్‌ కెంట్‌, ఉక్రెయిన్‌ కి మాజీ అమెరికా రాయబారి మేరీ మాషా యునోవిచ్‌ తమ వాంగ్మూలాలు ఇచ్చారు. 


కాగా, అధ్యక్షుడిని తొలగించడానికి అమెరికా చట్టసభ చేపట్టే రెండు దశల ప్రక్రియలో అభిశంసన అనేది మొదటిది. దేశద్రోహం, అవినీతి, తీవ్రమైన తప్పులు, నేరాలు చేసినట్టు తేలితే అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఈ అభిశంసన ప్రక్రియ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ ప్రారంభమవుతుంది. మొదటగా అభిశంసన విచారణ జరుపుతుంది. అధ్యక్షుడి నేరాలకు తగిన ఆధారాలుంటే, ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఇందులోని సభ్యులు సాధారణ మెజార్టీతో అభిశంసనలోని అధికరణాలను ఆమోదించినా, అధ్యక్ష్యుడు అభిóశంసనకు గురవుతారు. అయితే, అభిశంసనకు గురైనంత మాత్రాన అధ్యక్ష పదవి కోల్పోడు. అనంతరం రెండో దశ ప్రారంభమవుతుంది. ఈ దశలో అభిశంసనలో పేర్కొన్న అభియోగాలపై సెనేట్‌ సమగ్ర విచారణ జరిపి, ఓటింగ్‌ నిర్వహిస్తుంది. సభలో మూడింట రెండొంతుల మెజార్టీ సభ్యులు ఆమోదిస్తే.. అప్పుడు అధ్యక్షుడు పదవి కోల్పోతారు. ఒకవేళ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ఆమోదించబడితే.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: