లక్షల్లో ఫీజులు వసులు చేస్తాయి.. కానీ కొన్ని జాగ్రత్తలు కూడా ఉండవు.. పదికి పది పాయింట్లు వచ్చాయి అని అంటారు. లక్షల్లో డబ్బు గుంజుతారు.. పసిపిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనేది కూడా తెలియదు. ఇలా పాఠశాల నిర్లక్ష్యం వల్లే పురుషోత్తంరెడ్డి అనే 5 ఏళ్ల చిన్నారి సాంబారులో పడి మృతి చెందాడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా పాణ్యంలోఈ ఘటన జరిగింది. 


కర్నూలు జిల్లా పాణ్యంలో విజయానికేతన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో సాంబారులో పడి పురుషోత్తంరెడ్డి బుధవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లె గ్రామానికి చెందిన బైరాపురం శ్యాంసుందర్‌ రెడ్డి తన కుమారుడు పురుషోత్తం రెడ్డిని విజయానికేతన్‌ పాఠశాలలో యూకేజీలో చేర్పించారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం భోజన సమయంలో పురుషోత్తం రెడ్డి ప్లేటు చేతిలో పట్టుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు సాంబారు పాత్రలో పడ్డాడు. 


కాస్త దూరంలో ఉన్న ఓ మహిళ గమనించి బాలుడిని బయటకు తీసింది. సాంబారు వేడిగా ఉండడంతో అప్పటికే పురుషోత్తం ఒళ్లంతా బొబ్బలెక్కాయి. పాఠశాల సిబ్బంది హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోజు సాయంత్రం మృతి చెందాడు. పాఠశాల సిబ్బంది కర్నూలు ఆసుపత్రిలో బాలుడిని వదిలి వెళ్లిపోయారు.  


పాఠశాల యాజమాన్యానికి ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్ చేసి ఉందని అన్నారు. కాగా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే తన కుమారుడి మృతికి కారణమని తండ్రి ఆరోపించారు. నలుగురు విద్యార్థులకు ఒక కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేస్తామని తమ వద్ద రూ.50 వేల ఫీజు వసూలు చేసి ఇప్పుడు తనకు కడుపుకోతను మిగిల్చారని బోరున విలపించాడు, విద్యార్థులకు రక్షణ లేని పాఠశాల గుర్తింపు రద్దు చెయ్యాలని అయన అన్నారు. అయితే ప్రైవేట్ పాటశాలలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయినప్పటికీ ప్రైవేట్ పాఠశాలలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: