చంద్రబాబునాయుడు అట్టహాసంగా చేసిన దీక్షకు ఎంతమంది ఎంఎల్ఏలు హాజరయ్యారు ? ఇపుడిదే అంశంపై పార్టీలో తీవ్రంగా చర్చ మొదలైంది. విజయవాడలో చంద్రబాబు చేసిన 12 గంటల దీక్షలో కేవలం తొమ్మిది మంది ఎంఎల్ఏలు మాత్రమే హాజరయ్యారట. దీక్ష చేసిన చంద్రబాబుతో కలుపుకుని 10 మంది ఎంఎల్ఏల లెక్క తేలింది. మరి మిగిలిన 13 మంది ఎంఎల్ఏల మాటేమిటి ? వాళ్ళెందుకు హాజరుకాలేదు ?

 

తాను చేయబోతున్న దీక్షలో అందరు ఎంఎల్ఏలు, ఎంపిలు తప్పక హాజరవ్వాలని పార్టీ కార్యాలయం నుండి ఆదేశాలిప్పించారు. అయితే మెజారిటి ఎంఎల్ఏలు, నేతలు కనీసమాత్రం కూడా ఆదేశాలను లెక్క చేయలేదని సమాచారం.

 

సరే పార్టీకి, ఎంఎల్ఏ పదవికి ఇప్పటికే రాజీనామా చేసిన గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ విషయంలో క్లారిటి వచ్చింది. కాబట్టి తన దీక్షకు వంశీ హాజరవుతారని చంద్రబాబు కూడా అనుకునుండరు. మరి మిగిలిన 12 మంది ఎంఎల్ఏలు ఎందుకు హాజరుకాలేదు ? ఇపుడిదే అంశంపై  అందరిలో చర్చ జరుగుతోంది.  అదే సమయంలో గైర్హాజరైన ఎంఎల్ఏలు ఎక్కడున్నారనే విషయంపై  నేతలు ఆరాలు తీస్తున్నట్లు సమాచారం.

 

విశాఖపట్నం నగరంలో గెలిచిన నలుగురు ఎంఎల్ఏలూ కనబడలేదట. వీరంతా గంటా బ్యాచ్ లో ఉన్నారట. అంటే గంటా టిడిపికి రాజీనామా చేస్తే వీరు కూడా రాజీనామాలు చేసేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ప్రకాశం జిల్లాలోని నలుగురు ఎంఎల్ఏలు కరణం బలరామ్, ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయులు, గొట్టిపాటి రవికుమార్ కూడా ఎక్కడా కనబడలేదట.

 

మిగిలిన వారిలో బుచ్చయ్య చౌదరి, నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ ఉన్నారు. కేశవ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. బాలకృష్ణ ఏ షూటింగ్ లో ఉన్నారో తెలీదు. మరి బుచ్చయ్య సంగతేమిటి ? మొత్తం మీద స్టేజి మీద ప్రముఖంగా కనిపించింది మాత్రం అచ్చెన్నాయుడు, రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: