ఏపీ ప్రభుత్వం వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ప్రభుత్వం సంవత్సర ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బియ్యం కార్డు కలిగిన వారితో పాటు 5 లక్షల రూపాయల వార్షికాదాయం ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తించనుంది. జగనన్న విద్యా వసతి దీవెన, వైయస్సార్ పెన్షన్ కార్డులు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం తేల్చింది. 
 
35 ఎకరాలలోపు మెట్టభూమి, 12 ఎకరాలలోపు మాగాణి ఉన్నా ఈ పథకానికి అర్హులే. 334 చదరపు అడుగుల కన్నా తక్కువ ప్రాంతానికి మున్సిపల్ పన్ను చెల్లిస్తున్న వారు ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు. 5 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. పారిశుద్ధ్య కార్మికులు, పార్ట్ టైమ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు. 
 
ప్రైవేట్ రంగ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ గౌరవ వేతనం పొందేవారు ఈ పథకానికి అర్హులు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కుటుంబంలో ఒక కారు ఉన్నా వర్తిస్తుంది. కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉంటే మాత్రం ఆరోగ్యశ్రీ పథకం వర్తించదు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లోని 130 ఆస్పత్రుల్లో ఈ సేవలను పొందవచ్చు. 
 
డిసెంబర్ నెల 21వ తేదీ నుండి ప్రజలకు పూర్తిస్థాయిలో ఈ పథకం అందుబాటులోకి రానుంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పథకం మొదట పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. ఆ తరువాత ఇతర జిల్లాలకు కూడా ఈ పథకం విస్తరించనుంది. 1000 రూపాయలు దాటిన ప్రతి చికిత్సకు అర్హులైన వారికి వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. ప్రతి మండలానికి 108, 104 వాహనాలను అందించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: