ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన సంగతి అందరికి తెలిసిందే కదా. ఈ పర్యటనలో లోకేష్‌తో పాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, మాణిక్య వరప్రసాద్, జీవీ ఆంజనేయులు ఉన్నారు. కానీ, ఆ మాజీ ఎమ్మెల్యే మాత్రం మిస్ అయ్యారు. లోకేష్ టూర్‌కు ఆయన ఎందుకు రాలేదన్నది ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఆయనే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర. 


గత ఎన్నికల ముందు వరకు వరుసగా ఐదుసార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యే మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అప్పటి నుంచి దూళిపాళ్ల నరేంద్ర కొంత సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. అడపా.. దడపా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. అయితే, తన నియోజకవర్గానికి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వస్తే ఆయన మాత్రం పాల్గొనకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పొన్నూరులో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు రవి కుటుంబ సభ్యులను నారా లోకేష్ పరామర్శించడం జరిగింది.


లోకేష్ టూర్‌లో నరేంద్ర అనుచరవర్గం మొత్తం పాల్గొందని, కానీ, ఆయన ఒక్కరే రాలేదన్నది కొందరి మాట. మృతుడు రవి ఇంటికి రాలేకపోయారు సరే.. కనీసం నియోజకవర్గంలో పర్యటించే సమయంలోనైనా లోకేష్‌ను కలవకపోవడంపై మాత్రం చర్చ ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. మరోవైపు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఆళ్లపాటి రాజాతో పాటు ధూళిపాళ్ల నరేంద్ర ప్రయత్నం చేస్తున్నారని, దీంతో వీరి మధ్య అధ్యక్ష పదవి కోసం తెగ పోటీ నడుస్తుందంటూ రాజకీయవర్గాల్లో విస్తృత స్థాయి చర్చ కొనసాగుతుంది.


అందులో భాగంగానే తన నియోజకవర్గంలోకి లోకేష్‌ను ఆలపాటి రాజా తీసుకువస్తున్నారని భావించిన ధూళిపాళ్ల ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారని, అంతేకాకుండా ఆళ్లపాటికి, నరేంద్రకు జిల్లాలో ముమ్మర వర్గపోరు నడుస్తుందని టీడీపీ శ్రేణులే బాహాటంగా చెప్పడం గమనార్హం. మరోపక్క ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీలో చేరేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారని, ఆ క్రమంలోనే నారా లోకేష్ పర్యటనకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేయలేదన్నది మరికొందరి వాదన అని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: