మహారాష్ట్ర రాజకీయం కొన్ని రోజుల నుచి థ్రిల్లర్ మూవీని తలపించింది. శివసేన  బీజేపీ సీఎం పదవి కోసం కొట్టుకోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడలేదు. అయితే శివసేన ఈసారి తమకు సీఎం పదవి ఇవ్వాలంటూ పట్టుపట్టి.. సుదీర్ఘ మిత్రత్వాన్ని వదిలేసుకోవటమే కాదు.. కొత్త మిత్రుల కోసం వారు పడిన తపన ఒక కొలిక్కి రావటమే కాదు.. కొత్త మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఒప్పందం జరిగినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వాన్ని శివసేన..ఎన్సీపీ.. కాంగ్రెస్ లు  కలిసి చేపడతాయని చెబుతున్నారు. కీలక పదవుల పంపకాల విషయంలో మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. శివసేనకు ఐదేళ్ల పాటు సీఎం పీఠాన్ని ఇచ్చేందుకు ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీలు అంగీకారానికి రావటంతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవి.. ఎన్సీపీకి మండలి ఛైర్మన్ పదవి ఇచ్చేందుకు సేన ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.


మూడు పార్టీలు కాంగ్రెస్ .. ఎన్సీపీ .. శివసేన ఎటువంటి విభేదాలు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పదవులకు సంబంధించి మూడు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలకు లేకుండా.. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పార్టీల మధ్య సామరస్యవాతావరణంలో ఒప్పందం జరిగినట్లుగా సమాచారం. మహారాష్ట్ర సీఎం పదవితో పాటు శివసేనకు 14 మంత్రి పదవులు తీసుకోనున్నారు. ఎన్సీపీ విషయానికి వస్తే డిప్యూటీ సీఎం పదవితో పాటు 14 మంత్రి పదవులు.. కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ సీఎం పదవితో పాటు 12 మంత్రి పదవులు తీసుకునేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం.


అయితే సీఎం పదవి కోసం ఎన్సీపీ కూడా పట్టుపట్టిందన్న ప్రచారానికి విరుద్ధంగా .. పూర్తికాలం పాటు శివసేనకే సీఎం పదవిని ఇచ్చేందుకు ఎన్సీపీ.. కాంగ్రెస్ లు సిద్ధం కావటం ఆసక్తికరంగా మారింది. తాజాగా కొత్త మిత్రపక్షాలతో జరిగిన ఒప్పందాన్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ రోజు (శుక్రవారం) వెల్లడిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. గవర్నర్ వద్దకు వెళ్లటం.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని చూపించటం లాంటి సాంకేతిక అంశాలు రెండురోజుల్లో పూర్తి చేయటంతో పాటు.. ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: