సుప్రీంకోర్టు చరిత్రలో యాక్షన్‌ ప్యాక్డ్‌ ఫెర్‌ఫామెన్స్ తీర్పుల రోజులివి. చీఫ్ జస్టిస్ ఆఫ్‌ ఇండియాగా చివరి నిముషాలను ఉత్కంఠ భరిత తీర్పులతో ముగించారు సీజేఐ రంజన్‌గొగోయ్‌. ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదవీ కాలం నేటితో ముగిసింది. 17న రిటైర్ అవుతున్న రంజన్‌గొగోయ్‌.. చివరిసారిగా సర్వోన్నత న్యాయస్థానంలోని నెంబర్ వన్ కోర్టు నిర్వహించారు. 


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులలో చీఫ్ జస్టిస్ రంజన్‌గొగోయ్‌ది ప్రత్యేక స్థానం. వారం రోజలుగా సర్వోన్నత న్యాయస్థానం వార్తల్లో పతాక శీర్షికల్లో నిలబడింది. అందులో చీఫ్‌ జస్టిస్ నాయకత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులు దేశం యావత్తుని ప్రభావితం చేశాయి. వీటిలో అయోధ్య మీద తీర్పు ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. వందేళ్లకు పై బడిన వివాదం.. దేశమంతటా ఉత్కంఠ రేపిన గొడవలో సుప్రీం జడ్జిమెంట్‌ను అందరూ స్వాగతించారు. అయోధ్య సమస్యకు పరిష్కారం సూచించిన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ చరిత్ర పుటలకెక్కారు.


సుప్రీంకోర్టు అస్థిత్వం ప్రమాదంలో పడిన తరుణంలో రంజన్‌ గొగోయ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. దీపక్ మిశ్రా చీఫ్ జస్టిస్ గా ఉన్న సమయంలో రోస్టర్ విధానంపై నలుగురు న్యాయమూర్తులు కోర్టు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు ప్రతిష్ట పరీక్షకు నిలబడింది. రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మారాయి. సీజేఐగా ఆయన నిర్మొహమాటంగా వ్యవహరించారు. సుప్రీంకోర్టు అర్జంట్‌గా ఏ కేసు విచారణ చేపట్టదని స్పష్టంగా ప్రకటించారు. దానికే కట్టుబడ్డారు. కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 


దేశంలో తీవ్రమైన వివాదాలు, కోట్లమందితో ముడిపడిన కేసుల విషయంలో రాజ్యాంగ ధర్మాసనాల్ని ఏర్పాటు చేశారు. కోర్టు చరిత్రలోనే సుదీర్ఘంగా విచారించారు. 134 ఏళ్ల అయోధ్య వివాదానికి ముగింపు పలికారు. రాఫెల్ డీల్‌పై ఇచ్చిన తీర్పులో రివ్యూ అవసరం లేదని తీర్పు చెప్పారు. శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడం ద్వారా.. ఈ వ్యవహారంలో సమున్నత న్యాయం జరిగేందుకు అవకాశం కల్పించారు. సీజేఐగా ఆయన చివరి రోజుల్లో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొని ఉండవచ్చనేది న్యాయనిపుణుల విశ్లేషణ.


రంజన్ గొగోయ్ తండ్రి కేశవ్ చంద్ర గొగోయ్ కాంగ్రెస్ నాయకుడు. 1982లో ఆయన అసోం ముఖ్యమంత్రిగా పని చేశారు. రంజన్ గొగోయ్‌ను కాంగ్రెస్‌లో చేరాలని పార్టీ నాయకులు కోరినా.. ఆయన తండ్రి న్యాయవాదిగా కొనసాగాలని భావించారు. 1978లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన రంజన్ గొగోయ్.. 2001లో గౌహతి హైకోర్టులో న్యాయమార్తి అయ్యారు. 2011లో పంజాబ్- హర్యానా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2018 అక్టోబర్ 18న జస్టిస్ రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేశారు. 


చీఫ్‌ జస్టిస్‌గా చివరి రోజున కోర్ట్ నెంబర్ వన్‌ నిర్వహించిన ప్రధాన న్యాయమూర్తి.. కాబోయే చీఫ్ జస్టిస్ బోబ్డేతో సమావేశం అయ్యారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ రంజన్ గొగోయ్‌కు అభినందనలు తెలిపింది. కోర్టు ముగిసిన తర్వాత.. దేశంలోని హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: