ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సిద్దం కాగా కొంత మంది ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని పై విచారించిన హైకోర్టు ఎన్నికల పై స్టే విధించేందుకు నిరాకరించింది. ఎన్నికలు నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 


అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీనిపై కూడా హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వీటిపై విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.  దీంతో సర్పంచ్, ఎంపీటీసి, జడ్పీటీసి, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సిద్ధం కూడా అయంది.


2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసిలకు 62.03శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. అయితే 2014లో రాష్ట్ర విభజన కావడంతో రిజర్వేషన్ల శాతం 59.85 శాతంకు పరిమితమైంది. అయితే రెండేళ్ల కిందట సుప్రీం కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. 

 

సుప్రీం కోర్టు ఆదేశాలతో బీసీల రిజర్వేషన్‌ను కుదించవలసిన పరిస్థితి ఏర్పడింది.  గత ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో 59.85 శాతం కోటాను అమలు చేయగా.. అందు కోసం కోర్టును ఒప్పించాలని అందుకు తగ్గట్లుగా వాదించాలని సీఎం జగన్ సూచించారు. 2018లో స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినా అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. తాజాగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: